సిఐడి కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారంటూ టిడిపి ఎమ్మెల్యే కె. రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు, సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై కేసు నమోదయ్యింది. తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారని, బైపాస్ సర్జరీ జరిగినట్టు చెప్పినా
ఛాతిపై కూర్చుని తనను చంపడానికి ప్రయత్నించినట్లు రఘురామ ఫిర్యాదు చేశారు. తన ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాలని ఇష్టమొచ్చినట్టు కొట్టారని, జగన్‌ను విమర్శిస్తే చంపుతామని సునీల్‌కుమార్ బెదిరించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గుంటూరు నగరంపాలెం పోలీసులు సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508(34) ప్రకారం కేసు నమోదు చేశారు.
పోలీసులు ఒత్తిడి మేరకు తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చారంటూ నాటి జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఏ1గా మాజీ డీజీ సీఐడీ సునీల్‌కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ3గా వైఎస్ జగన్, ఏ4గా విజయ్‌పాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతి పేర్లు చేర్చారు. 2021 మే 14న జరిగిన ఘటనపై నిన్న సాయంత్రం ఈమెయిల్ ద్వారా రఘురామకృష్ణ ఫిర్యాదు చేయగా నేడు కేసు నమోదైంది.
కాగా, ఈ కేసుపై సునీల్ కుమార్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “సుప్రీంకోర్టులో మూడేళ్ళు నడిచి… సాక్షాత్తూ సుప్రీం కోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాను” అంటూ పోస్ట్ చేశారు.