కుప్పంలో వరుసగా మూడో రోజు కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గుడిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించారు. కుప్పంలో జరుగుతున్న సంఘటనలు, పోలీసుల వ్యవహారశైలిపై డిజిపికి లేఖ రాసినా స్పందన లేకపోవడంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుదిపల్లిలో రోడ్ షో కు అనుమతి ఇవ్వకపోవడం, తమ పార్టీ ప్రచార రథాన్ని వెనక్కి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ చంద్రబాబు నిరసన తెలిపారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడిపల్లికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, బారికేడ్లు అడ్డం పెట్టడం ఏమిటని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు ర్యాలీలు చేస్తున్నారని, తమను మాత్రం అడ్డుకుంటున్నారని, వారికో రూలు, తమకో రూలా అంటూ పోలీసులను నిలదీశారు. వైసీపీకి తొత్తులుగా పనిచేసే పోలీసులపై ప్రజలు ఉమ్మేస్తారంటూ ఘాటుగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో అరాచక, రౌడీయిజం ఎక్కువైపోయాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ వీరి ఆటలు సాగనీయబోమని హెచ్చరించారు. ప్రజాహితం కోసమే తాము పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. మూడు రోజులుగా పోలీసుల అరాచకాలను తాను గమనిస్తున్నానని, బానిసలుగా బతకోద్దని పోలీసులకు సూచించారు. ఇక్కడ ఉన్న పోలీసు ఉన్నతాధికారులు తన వద్దకు వచ్చి మాట్లాడాలని బాబు అల్టిమేటం ఇచ్చారు.
ఆ తర్వాత తాను ప్రయాణిస్తున్న వాహనం పైకి ఎక్కి బాబు ప్రసంగించారు. తన రోడ్ షో కు అనుమతి ఇవ్వకుండా తన నియోజకవర్గంలోనే తనను నడిపించడానికి ఎంత ధైర్యం అంటూ ప్రశ్నించారు. ప్రజల కోసం ప్రాణాలైనా ఇచ్చే సంకల్పం తనదని, తనను శారీరకంగా ఇబ్బంది పెట్టగలరు కానీ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో ప్రజలను కలుసుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు.