తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లను గొట్టంగాళ్ళు అని విజయవాడ ఎంపి కేశినేని వ్యాఖ్యానించారు. ఆ గొట్టంగాళ్ళ కోసం కూడా పనిచేస్తున్నానని ఘాటుగా విమర్శించారు. తనకు వేరే పార్టీల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని పరోక్షంగా వెల్లడించారు. తనకు పొమ్మనలేక పొగబెడుతున్నట్లు ఉందని, ఆ వేడి ఎక్కువై తనకు వందశాతం మండితే అప్పుడు ఇతర పార్టీల నుంచి వస్తున్న ఆఫర్ల గురించి ఆలోచన చేస్తానని ప్రకటించారు. మంచివాడిని కాబట్టే తనను వైసీపీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలకు ఆహ్వానిస్తున్నారని, పార్టీ ఏదైనా అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలతో కలిసి పని చేస్తానని, టిడిపికి చెందిన గద్దె రామ్మోహన్ తో కూడా కలిసి పని చేస్తున్నానని చెప్పారు. పార్టీ ఇన్ ఛార్జ్ అంటే రాజ్యాంగ బద్ధమైన పదవి కాదన్నారు.
ఎంపి ఫండ్స్ నుంచి తిరువూరు నియోజకవర్గం, ఏ.కొండూరు మండల పరిధిలోని 16 కిడ్నీ బాధిత గ్రామాలకు వాటర్ ట్యాంకర్లు మంజూరు చేశారు. విజయవాడ కేశినేని భవన్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఈ వాహనాలను ఆయా గ్రామ కార్యదర్శులకు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో ప్మట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో కంఫర్ట్ గా ఉన్నారా అన్న ప్రశ్నకు… విజయవాడ ప్రజలు నాతో చాలా కంఫర్ట్ గా ఉన్నారని బదులిచ్చారు. ఎంపిగా తాను పోటీ చేయాలో వద్దో అనేదానిపై ప్లెబిసైట్ నిర్వహించాలని సూచించారు. ఒకసారి ప్రజా ప్రతినిధిగా గెలిచిన తరువాత ప్రాంతం కోసం, ప్రజల కోసం పనిచేయాలని, ఆ మైండ్ సెట్ తో పని చేస్తున్నానని, తన ఆలోచనా విధానం క్లియర్ గా ఉన్నప్పుడు వేరే అంశాల గురించి ఆలోచించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. మహానాడుకు తనను పిలవలేదని, తన అవసరం లేకపోవచ్చన్నారు. తనకు పార్టీలో ఏ హోదా లేదని, పార్టీ నుంచి గెలిచిన ఎంపిగా ఉన్నానన్నారు.
అమిత్ షా తో చంద్రబాబు ఎందుకు భేటీ అయ్యారో తనకు తెలియదన్నారు నాని. కలిసి వెళ్ళాం, కలిసి వచ్చామని కానీ మీటింగ్ కు తాము వెళ్ళలేదన్నారు.