సాధారణంగా వీఐ ఆనంద్ సినిమాలు అనగానే, అవి ఒక ప్రత్యేకమైన జోనర్లో ఉంటాయనే విషయం ఆడియన్స్ కి అర్థమైపోతుంది. అందుకు కారణం ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన సినిమాలే. అదే తరహాలో ఆయన నుంచి వచ్చిన మరో సినిమానే ‘ఊరుపేరు భైరవకోన’. సందీప్ కిషన్ – వర్ష బొల్లమ్మ – కావ్య థాపర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. పోస్టర్ల దగ్గర నుంచే ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చింది.
దర్శకుడు హారర్ .. సస్పెన్స్ .. ఫాంటసీ … యాక్షన్ .. కామెడీని కలుపుకుంటూ ఈ కథను నడిపించాడు. ఈ సినిమాలో హీరోయిన్ తన గూడెం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేకపోతుంది. తమ గూడెం ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి కొంతమంది దుర్మార్గులు చేసే ప్రయత్నాలను ఎదుర్కొంటుంది. ఆ సమయంలోనే ఆమె హీరో ప్రేమలో పడుతుంది. ఆమె మనసు తెలుసుకున్న హీరో, ఆమె ఆశయాన్ని నెరవేర్చడం కోసం అటు రౌడీలతో .. ఇటు దెయ్యలతో చేసే పోరాటమే ఈ కథ.
దెయ్యలతో ఒక ఊరు ఎందుకు ఏర్పడింది? గరుడ పురాణానికి .. ఈ ఊరుకి ఉన్న సంబంధం ఏమిటి? అనేది దర్శకుడు చెప్పాడు. పైగా ఆ పురాణంలోని చివరి నాలుగు పేజీలను కృష్ణదేవరాయలు చింపేశాడంటూ, కథకి చరిత్రను జోడించే ప్రయత్నం కూడా చేశాడు. యాక్షన్ సీన్స్ ను .. ఛేజింగ్స్ ను గట్టిగానే డిజైన్ చేశారు. మధ్య మధ్యలో కొన్ని హాలీవుడ్ హారర్ సినిమాలను గుర్తుచేశారు. మొత్తానికి సందీప్ కిషన్ ఒక కొత్త జోనర్ ను ట్రై చేశాడనే చెప్పాలి.