10.3 C
New York
Sunday, December 10, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఓటీటీల్లో సెలబ్రిటీల పెళ్లిళ్లు

ఓటీటీల్లో సెలబ్రిటీల పెళ్లిళ్లు

Marriage-Marketing:
నెట్ ఫ్లిక్స్ లో నవ లావణ్య పెళ్లి వీడియో!
8కోట్లకు ప్రసార హక్కుల అమ్మకం?
ఇటలీలో ఘనంగా జరిగిన తెలుగు సినిమా హీరో- హీరోయిన్ పెళ్లి వీడియోను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.

3 రోజులపాటు కొనసాగిన వేడుకల రైట్స్ ను సదరు సంస్థ 8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు మీడియా వర్గాల్లో చర్చ.

త్వరలోనే ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

గతంలో హన్సిక-సోహైల్;
నయనతార- విఘ్నేశ్ శివన్ ల పెళ్లి వీడియోలు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే.


ఈ వార్త తెలిసినప్పటి నుండి భారతదేశంలో కొన్ని లక్షల నవీన జంటల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వృద్ధ జంటలు అవకాశం కోల్పోయినట్లు బాధపడుతున్నాయి. కాబోయే జంటలు మరింత క్లారిటీ వస్తే బాగుండు అని అనుకుంటున్నాయి.

కొన్ని వేల జంటలు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్ని హాట్ స్టార్, ఆహా, ఓహో, ఊహూ, ఏహే ఓ టీ టీ లకు ఉత్తరాలు రాశాయి. ఆ ఉత్తరాలను క్రోడీకరిస్తే సారాంశం ఇలా ఉంటుంది:-

1 . మీరు ఈ మధ్య సెలెబ్రిటీల పెళ్లి వీడియోలను మీమీ ఓ టీ టీ ల్లో స్ట్రీమింగ్ చేయడం కడుంగడు సంతోషదాయకం. దానికోసం ఎదురు కట్నంగా ఆ సెలెబ్రెటీలకు కోట్లకు కోట్లు చెల్లిస్తుండడం మాలో కొత్త ఆశలకు ఊపిరులూదుతోంది.

2 . ఆ సెలెబ్రిటీలకంటే మా అందం అరచేతి మందం ఎక్కువే కానీ…తక్కువ మాత్రం కాదు. మావి కూడా సేమ్ టు సేమ్ అలాంటి డెస్టినేషన్ మ్యారేజ్ లే. ఆస్తులమ్మి ధూమ్ ధామ్ గా 8 కే హెచ్ డి క్వాలిటీతో, డ్రోన్లు, లెన్సులు, ప్రీ వెడ్, పోస్ట్ వెడ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యుయస్ వెడ్ అన్ని టెన్సుల్లో సంగీత్ గెంతులు, హల్దీ చల్లుళ్లు, క్యాండిడ్ షూట్లు, కొరియోగ్రాఫర్ల శిక్షణలో ప్రత్యేక లొకేషన్లు అద్దెకు తీసుకుని థీమ్ సాంగ్ లు అన్నీ వారి కంటే ఎక్కువే కానీ…తక్కువ మాత్రం కాదు. మా సంగీత్ లో తొమ్మిది పదుల మా ముత్తవ్వ బోసి నవ్వులతో ఇంకేమింకేమింకేమింకేం కావాలే? అంటూ నాట్యం చేయబోయినప్పుడు నడుము విరిగి బెడ్డుకే పరిమితమయినా…చాల్లే ఇది చాల్లే అని…అభినయం ఆపలేదు. ఇలాంటి వీడియోలకు కోట్లకు కోట్ల వైరల్ వ్యూస్ వచ్చి…మీకు కోట్లకు కోట్ల డబ్బు వస్తుందని మీకు మేము చెప్పాల్సిన పనిలేదు.

3 . వారి మూడు రోజుల పెళ్లికి ఎనిమిది కోట్ల లెక్కను ఒక కొలమానంగా వేసుకుంటే మా రెండు రోజుల పెళ్లికి హీనపక్షం భారతీయ కరెన్సీలో అయిదు కోట్లు ఇవ్వవచ్చు. రేటు నెగోషియబుల్. కాస్త అటు ఇటు అయినా పరవాలేదు. సిగ్గు విడిచి…పురోహితుడిని పక్కకు తోసి…వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, కొరియోగ్రాఫర్లు, ఆర్ట్ డైరెక్టర్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, బట్టల డిజైనర్లు, హెయిర్ స్టయిలిస్ట్ లు, మేకప్ మ్యాన్, వుమెన్, ఈవెంట్ మేనేజర్లు, రిసార్ట్ మేనేజర్లు చేసిన మా పెళ్లి లోకం చూస్తే చాలు.

4 .మా పెళ్లి శాస్త్రోక్తంగా జరిగిందో! లేదో! చెప్పలేము కానీ…ఒక టీ వీ షో లా, ఒక సీరియల్లా, ఒక సినిమాలా, ఒక అంత్యాక్షరిలా, ఒక డ్యాన్స్ షోలా జరిగిందని మాత్రం కచ్చితంగా చెప్పగలము. ఆ రెండ్రోజుల వీడియోల్లో మీరు టక్కున చూసి నిర్ణయం తీసుకోవడానికి వీలుగా మార్తాండ్ కే వెంకటేష్ స్థాయికి తక్కువకాని ఒక సినిమా ఎడిటర్ తో కట్ చేయించిన రెండు నిముషాల లిరికల్ థియరిటికల్ ప్రాక్టికల్ మాంటేజ్ ప్రోమో మీకు 8 కే రెసొల్యూషన్లో ఈ ఉత్తరం వెంట పంపుతున్నాము.

5 . ఒకవేళ మా పెళ్లి వీడియో మీ సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా లేదని మీరు భావిస్తే…మీ ప్రమాణాలేమిటో చెప్తే మళ్లీ తాళి కట్టి…మళ్లీ షూట్ చేసి పంపడానికి, లేదా మీరే వచ్చి షూట్ చేసుకోవడానికి మాకెలాంటి అభ్యంతరం లేదని ఈ ఉత్తరం వెంట విడిగా జతచేసిన హామీ పత్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని…తుది నిర్ణయం తీసుకోగలరు.

6 . మా వివాహం ఒక వినోదం అవ్వడం కంటే మాకు ఇంకేదీ ముఖ్యం కాదన్న మా తపనను ఎంటర్టెయినింగ్ మీడియా మార్కెట్ ట్రూ స్పిరిట్లో మీరు అర్థం చేసుకుని…వెంటనే స్పందిస్తారని ఆశిస్తూ…

ఇట్లు
అనంతకోటి నవ దంపతులు;
అఖిలాండ కోటి కాబోయే దంపతులు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్