Saturday, January 18, 2025
HomeTrending Newsవ్యతిరేక ఓటును చీలనివ్వను: పవన్

వ్యతిరేక ఓటును చీలనివ్వను: పవన్

Ready for alliances: వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదని, దానికోసం దేనికైనా సిద్ధమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వైసీపీ వ్యతిరేక ఓటును ఏకం చేస్తానన్నారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలకుండా అందరూ కలిసి పనిచేశారని, అదే కోవలో తానూ కూడా  రాష్ట్రంలోని పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్రం ప్రయోజనాల కోసం ముందుకు వచ్చినప్పుడు అప్పుడు పొత్తుల కోసం ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాధ్యతని పవన్ కళ్యాణ్, జనసేన తీసుకుంటాయని సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నట్లు వెల్లడించారు.

“అధికార మదంతో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున వైసీపీ అనబడే మహిషానికి కొవ్వును విరగ్గోటి కింద కూర్చో బెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం- ఇదే జనసేన 9వ ఆవిర్భావ సభ యొక్క లక్ష్యం- ఉద్దేశం” అని మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామా పంచాయతీ పరిధిలో జరిగిన సభలో పవన్ ప్రకటించారు. బిజెపి నేతలు, పెద్దలు తనకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారని, దానికోసం తన పార్టీ కార్యకర్తలు, తాను ఎదురు చూస్తున్నమని, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా గద్దె దించాలో చెబితే దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

“పొరుగువారి మంచితనం దుష్టుడి దురహంకారాన్ని రెచ్చగొడుతుంది. పక్కవాడి సౌభాగ్యం పాలితుడి గుండెల్లో మంటలు రేపుతుంది…. కూల్చే వాడుంటే కట్టేవాడుంటాడు;  విడదీసేవాడుంటే కలిపెవాడుంటాడు; చీకట్లోకి తోసే వాడుంటే వెలుతురులోకి లాక్కొచ్చే వాడుంటాడు” అంటూ ప్రసంగించారు.

అమరావతే రాజధానిగా ఉంటుందని, ఎప్పటికీ ఇదే రాజధాని అని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి నేపథ్యంలో న్యాయవ్యవస్థ పై కూడా వైసీపీ దాడికి తెగబదిందని విమర్శించారు.  అందరినీ సమానంగా చూడాల్సిన పాలకులు ఒక కులాన్ని ఎందుకు వర్గ శత్రువులుగా చూస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.

బహిరంగ సభ నిర్వహించిన ఇప్పటం గ్రామ పంచాయతీకి పవన్ కళ్యాణ్ ట్రస్ట్ తరఫున 50 లక్షల రూపాయలు ప్రకటించారు. బండారు దత్తాత్రేయ, బూర నర్సయ్య గౌడ్, టిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి, తెలంగాణా మంత్రి కేటియార్, బిజెపి తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు సోము వీర్రాజు, బండి సంజయ్; సిపిఐ, సిపిఎం నేతలు రామకృష్ణ, మధు; టిడిపి అధినేత చంద్రబాబు- ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు; వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలకు పవన్ ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు, మాజీ ఎంపీ టి. సుబ్బరామిరెడ్డి, వైసీపీలో మంచి నేతలు అంటూ మేకపాటి గౌతమ్ రెడ్డి, అయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మాగంటి శ్రీనివాసులు రెడ్డిలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందరినీ గౌరవించడం జనసేన సంస్కారం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

‘వైసీపీది విధ్వంసం- మాది వికాసం; వారిది ఆధిపత్యం-మనది ఆత్మగౌరవం’ అంటూ ప్రసంగం ముగించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్