అభివృద్ధిని నిలబెట్టడం కోసం, కరోనా సంక్షోభం నుంచి ప్రజలను కాపాడుకోవడం కోసమే అప్పులు తెస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీన్ని కూడా ఓవైపు ఎల్లో మీడియా, మరోవైపు తెలుగుదేశం పార్టీ వక్రీకరించి, ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. పండు ఇచ్చే చెట్టు మీదనే రాళ్ళు పడతాయన్న సామెతను తాను బలంగా విశ్వసిస్తానని, ప్రభుత్వాన్ని ఎంతగా విమర్శించినా ప్రజలకు మేలు చేసే విషయంలో వెనక్కుపోయేది లేదని తేల్చి చెప్పారు.
ఎంఎస్‌ఎంఈలు, టెక్స్ టైల్, స్పిన్నింగ్ మిల్లులకు ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహకాలు 1,124 కోట్ల రూపాయలను క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజలను ఏమాత్రం మభ్యపెట్టకుండా, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చిత్తశుద్దితో కృషిచేస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించే విషయంలో గత చంద్రబాబు ప్రభుత్వ తీరు ‘హడావుడి ఎక్కువ- పని తక్కువ’ అన్నట్లు ఉండేదని సిఎం వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద సమిట్లు పెట్టేవారని, అగ్రిమెంట్లు రాసుకునేవారని, కానీ వాస్తవానికి ఏమీ ఉండేది కాదని గుర్తు చేశారు. కానీ మీడియాలో మాత్రం పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నట్లు ప్రచారం చేయించుకునేవారని జగన్ ఎద్దేవా చేశారు.
ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం కల్పిస్తున్నామన్నారు. మధ్య తరహా పరిశ్రమలను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని, వ్యవసాయంతో పాటు పరిశ్రమలు కూడా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని జగన్ చెప్పారు. ప్రభుత్వం తమకు అండగా ఉంటుందన్న భరోసా పారిశ్రామికవేత్తల్లో కల్పించాలని, అప్పుడే వారు ముందుకొస్తారని చెప్పారు.
ఒకవైపు పరిశ్రమలను ఊతమిస్తూనే మరోవైపు ప్రజల కొనుగోలు శక్తిని కూడా పెంచాల్సిన అవసరం ఉంటుందని సిఎం అభిప్రాయపడ్డారు. పరిశ్రమలు తయారు చేసే ఉత్పత్తులు ప్రజలు కొనే పరిస్థితి లేకపోతే కొంత కాలానికి ఆయా పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకే తమ ప్రభుత్వం 25 వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుచేస్తోందన్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా, లంచాలకు ఆస్కారం లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారుడికే నేరుగా అందిస్తున్నామని సిఎం వివరించారు. కరోనా సంక్షోభ సమయంలో సంక్షేమ పథకాల ద్వారా ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోగాలిగామని చెప్పారు.