Relief To All Flood Victims :
వరదల సమయాల్లో బాధితులకు, ప్రజలకు జరగాల్సిన మంచి శాచురేషన్ పద్ధతిలో సమర్ధంవంతంగా జరుగుతుందా లేదా అన్నది ముఖ్యమని, ప్రజలకు సాయం కరెక్టుగా అందేలా చూడడం నాయకుడి బాధ్యత అని, అక్కడకు వెళ్లి డ్రామాలు చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఇటీవలి వరదలపై ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. విపత్తును కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని సిఎం ఆరోపించారు.
“నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని విమర్శించారు. శాశ్వతంగా కనుమరుగైపోతానని ప్రతిపక్ష నేత అన్నారు. చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం. వరద సహాయక చర్యలు ఆగకూడదనే నేను వెళ్లలేదు. సీనియర్ అధికారుల సూచనల మేరకే ఆగిపోయా. నేను వెళ్లడం కన్నా బాధితులకు సహాయం అందడం ముఖ్యం. జిల్లాకొక సీనియర్ అధికారిని పంపాం. మంత్రులు, ఎమ్మెల్యేలను అక్కడే ఉండమన్నాం. నేను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించాను. సహాయక చర్యల తర్వాత కచ్చితంగా పర్యటిస్తా. హుద్‌హుద్, తీత్లీ తుఫానులను తానే ఆపానంటారు చంద్రబాబు. అప్పట్లో బాధితులకు అరకొర సహాయం కూడా చేయలేకపోయారని’’ జగన్ వ్యాఖ్యానించారు.
“ఇటీవల కురిసిన వర్షాలకు 3 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. వానలు రాయలసీమను ముంచెత్తడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. నీళ్లు లేక అలమటించే రాయలసీమలో అనూహ్య వరదలు సంభవించాయి. కొన్ని చోట్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది. నష్టం వివరాలు ఎక్కడా దాచిపెట్టడం లేదు. సహాయం అందించడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదని’’ సీఎం అన్నారు. ‘‘రిజర్వాయర్ల భద్రత పర్యవేక్షణకు సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తాం. నీటి నిల్వల పర్యవేక్షణకు కొత్త సాంకేతిక విధానాన్ని తీసుకొస్తాం. గతంలో వరదలు వస్తే చంద్రబాబు ఏ ఒక్కరిని ఆదుకోలేదు. వరద ముంపు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. మృతుల కుటుంబాలకు తక్షణ పరిహారంగా రూ.5లక్షలు అందించాం. వరద ప్రభావిత జిల్లాల్లో 100 శాతం విద్యుత్ పునరుద్ధరణ చేశా”మని సీఎం జగన్ వివరించారు.
Also Read : యు టర్న్ సిఎం జగన్ : చంద్రబాబు