Sunday, January 19, 2025
HomeTrending Newsబాబు పూర్తి చేసి ఉంటే..: సజ్జల

బాబు పూర్తి చేసి ఉంటే..: సజ్జల

పరిపాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పునరుద్ఘాటించారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఉంటుందని, అసెంబ్లీ అమరావతిలో, న్యాయరాజధాని కర్నూలులో ఉంటాయని, ఈ విషయమై  కొందరు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబులా తాము ఎన్నికలకు ముందు ఒక మాట, తరువాత మరో మాట చెప్పబోమని, ఆయనలా ఘోర తప్ప్పిదాలు చేయబోమని స్పష్టం చేశారు. కేవలం రాజధాని అంశంతోనే ఎన్నికలకు వెళ్లబోమని, తాము చేసిన ఎన్నో పథకాలతో పాటు వికేంద్రీకరణ కూడా ఒక అంశంగా ఉంటుందని చెప్పారు. విశాఖ రాజధాని అనేది జగన్ తీసుకున్న ఓ నిర్ణయాత్మక ఆలోచన అని సజ్జల చెప్పారు.

రాజధాని అంశంపై రాజకీయం చేస్తున్నది విపక్షాలు మాత్రమేనన్నారు. శివరామ కృష్ణన్ కమిటీ ఎన్నో సూచనలు చేసినా, వాటిని పక్కన పెట్టి అత్యంత సంకుచితంగా బాబు వ్యవహరించారని సజ్జల ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 20 ఏళ్ళు పడుతుందని, లక్ష కోట్ల రూపాయల మేర ఖర్చవుతుందని, అంటే ఖర్చు పెట్టే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.  ఒకవేళ రాజధానిని బాబు పూర్తి చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. కానీ తాము మాత్రం చంద్రబాబులాగా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అలోచించబోమన్నారు.  బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఏ సందర్భంలో అలా చెప్పారో తెలియదన్నారు.  తమ పార్టీ మొత్తం సిఎం జగన్ మాటకే కట్టుబడి ఉందన్నారు. తాము మూడు ప్రాంతాలనూ సమానంగా గౌరవిస్తామన్నారు.

విశాఖలో సిఎం క్యాంపు కార్యాలయమా, మరొకటా అనేది సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటుందన్నారు. సుప్రీం నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని, అయితే రాజధాని ఎక్కడ ఉండాలనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమని గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్