రాష్ట్రంలో రైతులను అయోమయానికి గురి చేస్తూ, వారిపై దాడులకు పాల్పడుతూ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని బిజెపిపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. యాసంగి పంట కొంటారా? లేదా ముందు స్పష్టం చేసి, తర్వాత మిగిలిన పనులు చేయాలని హితవు పలికారు. మహబూబాబాద్ లో నేడు మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు.
మంత్రి మాటలు నేరుగా…
యాసంగి పంట కొంటారా? లేదా ముందు స్పష్టం చేయండి? నేను రైతులను పరామర్శిస్తా, కొనుగోలు కేంద్రాలని సందర్శిస్తా అని దిక్కుమాలిన కార్యక్రమం పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతుంటే నీమాటలకు, చేతలకు పొంతనలేదని రైతులు తిరగబడుతున్నారు. టిఆర్ఎఎస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వారిలో చాలామంది రైతులున్నారు. నిజంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేయాలనుకుంటే, అడ్డుకోవాలనుకుంటే ఏ ఊరు తిరగవు. ఇలాంటి తెలివితక్కువ మాటలు బంద్ చేసి, రోడ్ల మీద తిరగడం బంద్ చేసి ఢిల్లీలో తిరుగు. కేంద్రాన్ని ఒప్పించు. స్పష్టమైన హామీ ఇప్పించి ఇక్కడి రైతులకు మేలు చేయ్. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు. తెలంగాణ రైతులను చూసి బిజెపి ఓర్వలేని తనంతో, కళ్లు కుట్టి ఇక్కడి రైతులను ఇబ్బందులు పెట్టడం ద్వారా టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పాలు చేయాలని బిజెపి కంటున్న కలలు సాగవు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మెడలు వంచే వరకు మా దీక్ష సాగుతుంది. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న వారి మెడలు వంచడం కేసిఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించారు. ఇప్పుడు బిజెపి మెడలు వంచి రైతుల ప్రయోజనాలు కాపాడడంలో ముందుంటారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, కురవి జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, బయ్యారం పిఏసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.