7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశీర్షికలతో ఫుట్ బాల్ ఆడుకున్నారు

శీర్షికలతో ఫుట్ బాల్ ఆడుకున్నారు

Heart-touching Headings:  ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో తొలి గోల్ మెస్సి కాలి మాయాజాలంతోనే మొదలయ్యింది. మాయాజాలం అన్న మాటకు నెగటివ్ మీనింగ్ కూడా ఉంది కాబట్టి మెస్సీని అవమానించినట్లు అవుతుందేమో! అదొక కనువిందు. ఆటలో నైపుణ్యం. బంతిని ఒక వైపుకు తంతున్నట్లుగా శరీరాన్ని, నడకను, కాలి కదలికను ప్రదర్శిస్తూ…గోల్ కీపర్ అటు వంగేలా చేస్తూ...సరిగ్గా దానికి భిన్నంగా గోల్ లోకి వెళ్లేలా బంతిని తన్నడం ఒక మెలకువ. చూసి తీరాల్సిన విన్యాసం. ఏ కాలితో తంతాడని గోల్ కీపర్ అనుకుంటాడో…ఆ కాలు చివరి క్షణంలో వెనక్కు వెళ్లి…ఇంకో కాలు బంతిని తంతుంది. మెదడుకు మెరుపు ఉండాలి. కాలికి మెదడు ఉండాలి. కాలికి కళ్లుండాలి. కాలికి బలముండాలి. ఇదంతా సెకనులో వెయ్యో వంతులో అసంకల్పితంగా జరిగిపోవాలి. నిజానికి ఇది అసంకల్పితం కానే కాదు. మెస్సి సంకల్పిత పాద విన్యాసం. అంతే. అది రాస్తే చదవాల్సింది కాదు. చూస్తే అర్థమయ్యేది.

మెస్సి ఏ దేశం వాడు? ఎన్నేళ్ల వాడు? అతడి కులం, గోత్రం ఏమిటి? అన్నవి చర్చలో లేనేలేవు. ఫుట్ బాల్ క్రీడను ప్రేమించే ప్రపంచానికి అతను బంధువు. హీరో. తన్మయత్వం.

టీ వీ ఛానెళ్లు పదే పదే అవే గోల్స్ వీడియోలను చూపుతూ వార్తలను, వ్యాఖ్యలను వండవచ్చు. చర్చలు చేయవచ్చు. అలాగని ప్రింట్ మీడియా చేతులు కట్టేసుకుని కూర్చోదు కదా? రాత్రి ప్రత్యక్ష ప్రసారంలో ఆట చూసినవారు పొద్దున్నే పత్రికల్లో అవే వార్తలను అన్ని కోణాల్లో చదివితే ఆ అనుభూతే వేరు. అలా ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్లో అర్జెంటీనా గెలుపు వార్తలు ప్రింట్ మీడియాలో మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా ఉన్నాయి.

ఈనాడు

బ్యానర్-
జగజ్జేత అర్జెంటీనా.
“గాలి స్తంభించేలా
కాలమే ఆగేలా
విశ్వమే బంతిగా మారి అతని కాలు కింద చేరిందేమో అనేలా షూటవుట్ తో కలిపి మూడు సార్లు బంతిని నెట్లోకి పంపించాడు మెస్సి…” అంటూ వార్తా రచన మెస్సి విన్యాసానికి మించి అద్భుతంగా ఉంది.

లోపల స్పోర్ట్స్ పేజీలో-
ప్రపంచాన్ని ఊపేసి
మెస్సి ఒళ్లో వాలింది.

సాక్షి


అర్జెంటీనా గర్జించింది.
మెస్సి కల నెరవేరింది.

లోపల స్పోర్ట్స్ పేజీలో-
అర్జెంటీనా గర్జన
మెస్సి మిషన్ పాజిబుల్
చక్కటి హెడ్డింగులు. చిక్కటి రచన.

ఆంధ్ర జ్యోతి

మెస్సి సేన మాయ
ఫోటో క్యాప్షన్- “అభిమాని మెస్సిన తరుణం” చక్కటి విరుపు. మెరుపు.

నమస్తే తెలంగాణ:

Argentina Victory
ఫస్ట్ పేజీలో ఫొటోకు రాసిన వ్యాఖ్య-
“మెస్సీమరైజింగ్ విక్టరీ”
చాలా బాగుంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా
బ్యానర్ హెడ్డింగ్ లో ప్రదర్శించిన రచనా చమత్కృతి అనన్యసామాన్యం.
SUPREMESSI
అందరికంటే గొప్ప అన్న సుప్రిమసి మాటలో చివర MESSI ని వేరే రంగులో ముందు సూపర్ అనే ధ్వనిని సాధిస్తూ సూపర్ గా పెట్టారు.
“Lionel heart conquers last (Maradona) mountain;
Cup of joy flows over”
బ్యానర్ హెడింగ్ పైన చిన్న అక్షరాల్లో ఉన్న ఈ మాటల్లో అందం, ఆనందం, సందర్భ శుద్ధి పిండుకున్నవారికి పిండుకున్నంత. మంచి హెడ్డింగులు ఎలా పెట్టాలో నేర్చుకునేవారికి పాఠం లాంటి శీర్షికా రచన ఇది.

 Argentina Victory

లోపల స్పోర్ట్స్ పేజీలో కూడా హెడ్డింగ్ గొప్పగా ఉంది.
“The wait is over, the world is his”
నిరీక్షణ ముగిసింది, ఇక ప్రపంచం అతడిది.

కలకాలం గుర్తుంచుకోదగ్గ శీర్షికలు, వార్తలు రాసినా…అనామకంగా మిగిలిపోయే పేరున్న సనామక జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరునా అభినందనలు. అర్ధరాత్రి లోకం నిద్రపోయే వేళ పత్రికా మైదానంలో మీరు మేల్కొని శీర్షికలతో మా మనస్సులో వేసిన గోల్స్ మెస్సి షూటవుట్ గోల్స్ కంటే ఏమాత్రం తక్కువైనవి కావు.

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Also Read :

నీరజతం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్