Friday, November 22, 2024
HomeTrending Newsవిజయవాడ వీరుడెవరో!

విజయవాడ వీరుడెవరో!

రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న విజయవాడ లోక్ సభ పోరు ఒక్క ఏపీలోనే కాకుండా రాజకీయ అవగాహన ఉన్న తెలుగు ప్రజలందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సొంత అన్నదమ్ములు ప్రత్యర్థులుగా తపలడుతున్నారు. 2014, 19 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందిన కేశినేని శ్రీనివాస్ (నాని) ఈసారి వైఎస్సార్సీపీ తరపున బరిలోకి దిగడం గమనార్హం.

విజయవాడకు 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ ఇండిపెండెంట్ గా గెలుపొందారు. కెఎల్ రావు మూడుసార్లు వరుసగా విజయం సాధించగా, చెన్నుపాటి విద్య, వడ్డే శోభనాద్రీశ్వర రావు, పర్వతనేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్, కేశినేని రెండేసి సార్లు ఎన్నికయ్యారు.

గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ వేవ్ లో సైతం నాని 8 వేల మెజార్టీతో గట్టెక్కారు. మోడీ తొలి ప్రభుత్వంలో టిడిపి భాగస్వామిగా ఉన్న సమయంలో కేంద్రం నుంచి వివిధ పథకాలకు నిధులు తీసుకురావడంలో నాని కృతకృత్యులయ్యారు. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ లను మంజూరు చేయించగలిగారు. ట్రాన్స్ పోర్ట్ వ్యాపారంలో ఉన్న నాని… రతన్ టాటా తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా టాటా హెల్త్ ట్రస్ట్ ద్వారా తన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు వైద్య చికిత్సలు చేయించారు. ఇది ఆయన విజయానికి ఎంతగానో దోహదం చేసింది.

నాని కుటుంబంలో ఏర్పడిన విభేదాలతో సోదరుడు చిన్ని నానికి దూరమయ్యారు. తన ఎంపి స్టిక్కర్ అక్రమంగా అతికించుకున్నారంటూ చిన్ని భార్యపై నాని కేసు పెట్టె వరకూ ఈ గొడవలు  వెళ్ళాయి. ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ ను కూడా నాని ఆపేశారు.

మరోవైపు… దేవినేని ఉమా, బొండా ఉమా, బుద్దా వెంకన్న సహా పార్టీ నేతలతో నానికి అంత సఖ్యత ఉండేది కాదు. విజయవాడ మున్సిపల్ ఎన్నికలు టిడిపి విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి.  కేశినేని కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్ధిగా టిడిపి ప్రకటించింది. నానితో కలిసి ప్రచారం చేసేది లేదని వెంకన్న, బొండా ఉమా, నాగూల్ మీరా లాంటి నేతలు తేల్చి చెప్పారు.  ఆ ఎన్నికల్లో టిడిపి ఓటమి పాలైంది. టిడిపి నేతల వైఖరి వల్లే ఇలా జరిగిందని నాని అలిగి పార్టీకి దూరంగా ఉండడం మొదలు పెట్టారు. టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి సమయంలో చంద్రబాబు చేసిన దీక్షకు సంఘీభావం తెలియజేయడం ద్వారా  పార్టీలో నాని మళ్ళీ క్రియాశీలం అయ్యారు. కానీ పార్లమెంటరీ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కలివిడిగా ఉంటుండేవారు. ఇది టిడిపి కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించేది.

ఇదే అదనుగా అప్పటివరకూ అన్న పోటీ సమయంలో ఎన్నికల మేనేజ్మెంట్ కే పరిమితమైన చిన్ని తెలుగుదేశం పార్టీలో సొంతంగా క్రియాశీలం అయ్యారు. అన్నా క్యాంటిన్ పునరుద్ధరణ పేరుతో లోక్ సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేపట్టారు. నానితో సరిపడని నేతలందరితో సత్సంబంధాలు కొనసాగించారు.  వయసులో తేడా కారణంగా  నారా లోకేష్ నాయకత్వాన్ని నాని అంగీకరించేవారు కాదు. దీనితో చిన్నికి సహజంగానే లోకేష్ అండదండలు దక్కాయి. బాబు మాత్రం నానివైపు మొగ్గు చూపేవారు.

ఎన్నికల వేడి మొదలు కాగానే టిడిపి చేపట్టిన పార్లమెంటరీ నియోజకవర్గాల బహిరంగసభల నిర్వహణ విషయం అన్నదమ్ముల విభేదాలను తారాస్థాయికి తీసుకెళ్ళింది. తిరువూరులో తలపెట్టిన ఈ మీటింగ్  పై అన్నదమ్ములిద్దరూ పోటా పోటీగా సమీక్షలు జరిపారు. అధిష్టానం రంగంలోకి దిగి చిన్నికే ఈ బాధ్యత అప్పగించింది. దీనితో నాని తెలుగుదేశం వీడి వైసీపీలో చేరారు.

అన్నదమ్ములు ఇద్దరూ ఈ ఎన్నికల రణక్షేత్రంలో తలపడుతున్నారు. జగన్ సంక్షేమం, విజయవాడకు తన హయంలో కేంద్రం నుంచి తీసుకు వచ్చిన పథకాలు, నిధులు, టాటా ట్రస్ట్ తో  అందించిన వైద్య సహాయం లాంటి అంశాలతో గెలుపుపై నాని ధీమాగా ఉండగా… ప్రభుత్వ వ్యతిరేకత, మూడు రాజధానుల అంశం, క్షేత్ర స్థాయిలో టిడిపికి ఉన్న కార్యకర్తల బలం, మూడేళ్ళుగా అన్నా క్యాంటిన్ ల నిర్వహణతో ప్రజల్లో లభించిన సానుకూలత, కూటమి లాంటివి తన గెలుపుకు మార్గం సుగమం చేస్తున్నాయని చిన్ని నమ్మకంతో ఉన్నారు.

చారిత్రక ప్రాధ్యాన్యం ఉన్న విజయవాడలో జరుగుతోన్న ఈ పోరు యావత్ తెలుగుజాతి దృష్టినీ ఆకర్షిస్తోంది. అన్నదమ్ములలో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి. గత ఎన్నికల్లో నానికి సహకారం అందించిన కమ్మ సామాజికవర్గం ఈసారి చిన్నివైపు మొగ్గు చూపుతోంది. అమరావతి రాజధానికి సమీపంలో ఉన్న ఈ హాట్ సీటును చేజిక్కించుకొని పట్టు నిలుపుకోవాలని టిడిపి… మొదటిసారి పార్టీ జెండా ఎగరేయాలని వైసీపీ…. హోరాహోరీ ప్రచారంతో దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం కేశినేని నాని ముందంజలో ఉన్నారు. ఈ పదిరోజుల ప్రచారం తరువాత ప్రజలు ఏ సోదరుడి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్