సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారిని భారత బాడ్మింటన్ స్టార్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పి.వి. సింధు దర్శించుకున్నారు. తన తండ్రితో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఆలయ మండపంలో ఆశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈసారి ఒలింపిక్స్ లో గోల్డ్ తీసుకురావాలని అర్చకులు ఆశీర్వదించారు. స్వామివారికి కప్పిన శాలువాతో ఆమెను సత్కరించారు. సింహాచలం క్షేత్ర మహత్యాన్ని, స్వామివారి వైభవాన్ని పీవీ సింధుకు అర్చకులు, అధికారులు వివరించారు.
సింహాచలం స్వామివారి ఆశీస్సులతో మూడోసారి కూడా ఒలింపిక్స్ లో తప్పకుండా పతకం సాధిస్తానని సింధు ధీమా వ్యక్తం చేశారు. రెండు వరుస ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన తొలి ఇండియన్ గా సింధు రికార్డు సృష్టించిన సంగతి విదితమే.