రాష్ట్రంలో ఈ వానాకాలం కోటీ యాబై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో.. యాబై లక్షలు ఇతర అవసరాలకు తీసుకోగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో ప్రక్రియ ప్రారంభించామని సివిల్ సప్లైశాఖ మంత్రి గుంగల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలోని నగునూర్, చామనపల్లి, చర్లబుత్కూర్, దుర్శేడ్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ఈ రోజు ప్రారంభించి వివరాలు వెల్లడించారు. 2014కు ముందు కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే నేడు కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం గర్వకారణమన్నారు. కేంద్రం నూకలు తినాలని, మేం కొనమని ఖరాఖండిగా చెప్పినా… రైతు పండించిన ప్రతీ గింజను కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. గతంలో శ్రీలంక లాంటి దేశాలు ఎదుర్కొన్న ఆహార సంక్షోభం చూసామని, కనీసం దాన్ని పట్టించుకోకుండా ముందు చూపు లేకుండా రైతుల పంటలపై చిన్నచూపుతో వ్యవహరించిన తీరుతో కేవలం ఆరు నెలల్లోనే కేంద్రం వద్ద నిల్వలు కొరత ఏర్పాడ్డాయని దుయ్యబట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఆహార భద్రతను గాలికొదిలి పూర్తి వ్యాపారిలా వ్యవహరించే కేంద్రం ఉండడం దురద్రుష్టమన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 6713 కొనుగోలు కేంద్రాల ప్రతిపాదించామని, ఇప్పటివరకూ 1545 కేంద్రాలు ప్రారంభించి దాదాపు 50వేల మెట్రిక్ టన్నుల్ని సేకరించామని మంత్రి తెలిపారు. వీటికి సాదారణ రకం 2040, మేలురకం 2060 మద్దతు ధరతో ధాన్యం సేకరిస్తామన్నారు. నిధుల కొరత లేదని, గన్నీలు, ప్యాడీక్లీనర్లు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లతో పాటు అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. గతంలో కళ్లాలు ఉండి ఎప్.ఏక్యూ వచ్చేదని ఇప్పుడు నేరుగా కొనుగోలు కేంద్రాలకు తెస్తుండడంతో అక్కడ ప్యాడీక్లీనర్ల ద్వారా ఎఫ్.ఏ.క్యూ పాటించి ఒక్క గింజను సైతం తరుగు పెట్టే ప్రసక్తే లేద మంత్రి గంగుల స్పష్టం చేశారు. కానీ కొన్ని చోట్ల రైతులే స్వయంగా రెండు మూడు కిలోలు తరుగు పెట్టినా సరె ఎట్లుందో అట్ల తీసుకోవాలంటున్నారని తద్వారా మిల్లుల్లో తరుగుతీస్తున్నారని ఈ సారి అలాంటి వాటికి అనుమతించేది లేదని మంత్రి గంగుల కమలాకర్ తెగేసి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 6313 మంది రైతుల దగ్గరనుండి సేకరించామని దీని విలువ దాదాపు 100 కోట్లుందన్నారు. గతంలోని 14 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం తోనే రైస్ మిల్లులున్నాయని, 2300 మిల్లుల్లో నిరంతరాయంగా మిల్లింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్.
ప్రతీ ఏఈవో పరిధిలోని 5వేల ఎకరాలను పీపీసీ కొనుగోలు సెంటర్లలోని ట్యాబ్ లకు అనుసందానం చేసామన్న మంత్రి ఖచ్చితంగా ఆ ప్రాంతం పంటను ఎలాంటి షరతులు లేకుండా సేకరిస్తామన్నారు. పక్క రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో మద్దతు దరతో కొనడం లేనందున ఆ ధాన్యం తెలంగాణకు వచ్చే అవకాశం లేకుండా పకడ్బందిగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నియంత్రిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. లారీ ట్రాన్స్ పోర్ట్ దారులు, రైస్ మిల్లర్లు పూర్తిగా సహకరించాలని విజ్ణప్తి చేసిన మంత్రి.. స్టోరేజీ లేని చోట ఇంటర్మీడియట్ స్టోరేజీ ఏర్పాటు చేసామన్నారు.
ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు గతంలోనే ఆదేశించామని, కోతలు రానిచోటకి రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం వెల్లి రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని ప్రతిపక్షాలకు మంత్రి గంగుల హితవు పలికారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 4.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేసామని 350 కొనుగోలు కేంద్రాలకు గానూ 97 కొనుగోలు కేంద్రాలను పంట వచ్చే ఏరియాల్లో ఏర్పాటు చేసామన్నారు, ఇప్పటివరకూ జిల్లాలో 7వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, నవంబర్ చివరి నుండి డిసెంబర్ మద్యలో కొనుగోళ్లు జోరందుకుంటాయన్నారు. ఎంత వచ్చినా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ శ్యామ్లాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.