ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, తాము పంచాయతీలకు ఇస్తున్న నిధులు ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేంద్రమే చెప్పిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. చివరకు సర్పంచ్‌లు నిధుల కోసం రోడ్లపైకి రావాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. పంచాయతీలను కాపాడుకుందాం ” అనే అంశంపై నేడు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్పంచ్‌ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పంచాయతీలను, వాటి హక్కులను కాపాడుకునే అంశంపై సమావేశంలో చర్చించారు. సమస్యలు, అభిప్రాయాలు తెలిపిన సర్పంచులకు పవన్ ధన్యవాదాలు తెలిపారు.
”రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలి. గ్రామీణ ప్రజలకు చెందిన డబ్బును దొచుకుంటున్నారు. గ్రామ పాలన కూడా సీఎం కార్యాలయం నుంచే జరగాలనుకోవడం సరికాదు. స్థానిక సంస్థలకు రాజ్యాంగపరంగా దక్కిన అధికారాలు లేకుండా చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఇంకా రాజు పాలనే సాగుతోంది. కేంద్రం ఇచ్చే నిధుల నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాలోకి రావాలి. గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధుల విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా” అని పవన్ వివరించారు.
గ్రామీణ నిధులను దారి మళ్ళించదాన్ని దోపిడీగానే చూడాల్సి ఉంటుందని, ఇలాంటి అంశాలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని అన్నారు. 73,74 రాజ్యంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు సంక్రమించిన అధికారాలను ఏ ప్రభుత్వం అమలు చేయడం లేదని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఇచ్చే నిధులు నేరుగా సర్పంచ్ ఖాతాల్లోకి వెళ్ళేలా చూడాలని, దీనిపై కేంద్రం దృష్టికి తీసుకు వెళతామని స్పష్టం చేశారు.