పట్టాల పంపిణీ పేరుతో అమరావతిలో రాజకీయ వికృత క్రీడకు జగన్ ప్రభుత్వం తెరతీసిందని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ ఆరోపించారు. ఐదు శాతం భూమి పేదల ఇళ్ళ కోసం కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలోనే పొందుపరిచామని, ఆ మేరకు దీనికి కేటాయించిన స్థలాల్లోనే టిడ్కో ఇల్లు కూడా నిర్మించామని వెల్లడించారు. రాజమండ్రిలో రేపటి నుంచి రెండు రోజులపాటు మహానాడు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది, అనతరం కాల్వ మీడియాతో మాట్లాడారు.
ఈ మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తామని, సీనియర్ నేత అశోక్ గజపతిరాజు నేతృత్వంలో ఈ ప్రక్రియ జరుగుతుందని కాల్వ తెలిపారు. మహానాడు ప్రసంగాలలో యువతకు పెద్ద పీట వేస్తామని, నాలుగేళ్ళుగా జగన్ ప్రభుత్వం యువతను ఏవిధంగా మోసం చేసిందో వివరిస్తామని చెప్పారు.
యువత తో పాటు మహిళలు, రైతులకు కూడా టిడిపి ప్రాధాన్యం ఇవ్వబోతోందన్నారు. చంద్రబాబు వస్తే సంక్షేమం ఎత్తివేస్తారనే దుష్ప్రచారం తిప్పి కొట్టేలా జగన్ నుంచి రాష్ట్రాన్ని కాపడుకునేలా మహానాడులో తీర్మానం చేస్తామని పేర్కొన్నారు.