Sunday, January 19, 2025
HomeTrending Newsప్రభుత్వాన్ని ప్రశ్నించండి: పవన్ పిలుపు

ప్రభుత్వాన్ని ప్రశ్నించండి: పవన్ పిలుపు

మీకోసం, మీ బిడ్డల భవిష్యత్ కోసం తనకు ఒక్క అవకాశం ఇవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగనన్న ఇళ్ళ కాలనీల సందర్శనలో భాగంగా విజయనగరంలోని గుంకలాం లే ఔట్ ను ఆయన  పరిశీలించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు  ప్రవేశ పెడతామని, అవినీతి రహిత పాలన అందిస్తానని భరోసా ఇచ్చారు. రాజధాని పేరిట ఉత్తరాంధ్ర ప్రజల్ని వైకాపా నేతలు మోసం చేస్తున్నారని విమర్శించారు. బంగారు భవిష్యత్‌ కోసం జనసేనను నమ్మాలని పిలుపునిచ్చారు.

”వైకాపా ప్రభుత్వ మోసాన్ని ప్రజలు గ్రహించాలి. ఉత్తరాంధ్ర ప్రజలకు బలమైన రాజకీయ అధికారం దక్కాలి. జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తాం. యువత తన శక్తిని అవినీతి నిర్మూలనకు వినియోగించాలి. మీ భవిష్యత్‌ కోసం నన్ను నమ్మండి. నాపై నమ్మకం ఉంచితే గూండాలతో పోరాడేందుకు నేను సిద్ధం. మత్స్యకారులు ఉపాధి కోసం గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఇక్కడే జెట్టీలు నిర్మించి వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. మత్స్యకారులకు హాని కలిగించే దేనినైనా జనసేన అడ్డుకుంటుంది. అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దాం. అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. ఉత్తరాంధ్ర జనసైనికులు ధైర్యంగా పోరాడండి. బలంగా ఎదుర్కోండి. కేసులు పెడితే మీతో పాటు నేనూ వస్తా. అవినీతి కోటల్ని బద్దలు కొడదాం” అని పవన్‌ అన్నారు.

తమ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఒక్కడు కూడా వదిలి వెళ్ళిపోయినా ప్రజా సమస్యలకోసం పోరాడుతున్నామని  పవన్ అన్నారు. గడప గడపకు వస్తున్న వైఎస్సార్సీపీ నేతలను సమస్యలపై నిలదీయాలని పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్