ఎవరో చెప్పిన మాటలు విని విశాఖలో భూ కుంభకోణాలు వెలికితీస్తానంటూ బయలుదేరిన పవన్ కళ్యాణ్ గత ఐదు రోజులుగా ఈ ప్రాంతంలో తిరిగినా ఏమి సాధించలేకపోయాడని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. పవన్ ఎందుకు తిరుగుతున్నాడో .. ఎవరి కోసం తిరుగుతున్నాడో ఆయనకే అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని, ఆయన్ను చూస్తే జాలి కలుగుతోందని వ్యాఖ్యానించారు. విస్సన్నపేట భూముల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని.. దాన్ని బయటపెడతానంటూ జబ్బలు చరుచుకుంటూ వెళ్లిన పవన్ కళ్యాణ్ కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేదని విమర్శించారు… వ్యాన్ ఎక్కి నాలుగు మాటలు మీడియాతో మాట్లాడి.. దిగి.. కారెక్కి వెళ్లిపోయిన పవన్ ను చూసి అందరూ నవ్వుకుంటున్నారని అన్నారు. విశాఖలో అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు.
2004వ సంవత్సరంలో రంగుబోలుగడ్డ కోసం 45 ఎకరాలను చంద్రబాబు నాయుడు హయాంలో సేకరించారని, అప్పట్లో రైతులకు పరిహారం కూడా ఇచ్చారని.. అక్కడున్నవి పోరంబోకు భూములు అయితే పరిహారం ఎందుకు ఇచ్చారని అమర్నాథ్ ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు నమ్మి విస్సన్నపేట వెళ్లి పవన్ కళ్యాణ్ సమయం వృధా చేసుకున్నాడని అన్నారు.
విస్సన్నపేట భూముల్లో జరిగిన వ్యవహారంపై మంత్రులతో చర్చకు సిద్ధమా అని మీడియా అడిగితే ‘మంత్రులతో మాట్లాడను నేరుగా సీఎంతోనే మాట్లాడుతానని’ పవన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన ఆరోపణలలో బలం లేకపోవడం వలనే అలా కప్పిపుచ్చుకొని వెనదిరిగారని అమర్నాథ్ అన్నారు. నిజంగా విస్సన్నపేట భూముల్లో అవకతవకలు జరిగి ఉంటే ఆయన ఆధారాలు చూపాలి కదా! లేవు కనుకనే మారు మాట్లాడకుండా వెనుతిరిగాడని విమర్శించారు.
“పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇమేజ్ ఆధారంగా చేసుకుని సినిమాల్లోకి వచ్చారు. ‘మీ నాన్న కానిస్టేబుల్ కాకముందే, మా తాత ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. మా కుటుంబం గత 60 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తోంది. నేను నా తండ్రిని, తాతను అడ్డం పెట్టుకొని రాజకీయాలకు రాలేదు. 18 ఏళ్లు కష్టపడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఇంత వాడినయ్యాను. మేము ప్రభుత్వ భూములకు కస్టోడియన్లుగా ఉంటాం కానీ, ఆక్రమించుకొబోమని” అమర్నాథ్ స్పష్టం చేశారు.
జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడలేక, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను స్వాగతించలేక, ద్వేషం, ఈర్ష్యతో ఆయన మీద అర్థం లేని ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా కాస్తంత జ్ఞానం సంపాదించుకొని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. పవన్ యువతను మభ్యపెట్టి తన వెంట తిప్పుకుంటూ కీచక గురువుగా తయారయ్యాడన్నారు. పవన్ కళ్యాణ్ నమ్ముకుని రాజకీయాల్లో ఎవరైనా ఒక రూపాయి పెట్టుబడి పెట్టినా అది తిరిగి రాదని, త్వరలోనే ఆయన తన కేడర్ ను మూటకట్టి చంద్రబాబు నాయుడుకి అమ్మేస్తాడని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జన సేన పార్టీలను బంగాళాఖాతంలో కలిపేస్తామని హెచ్చరించారు.