Sunday, September 8, 2024
HomeTrending Newsమా బలమేంటో ఎన్నికల తర్వాత తెలుస్తుంది : పవన్

మా బలమేంటో ఎన్నికల తర్వాత తెలుస్తుంది : పవన్

బలిచక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారని, కానీ వామనుడు నెత్తిమీద తొక్కుతుంటే ఆయన బలమేమిటో తెలిసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాడేపల్లిగూడెంలో  జరిగిన తెలుగుదేశం జనసేన బహిరంగసభలో  ప్రసంగించిన పవన్…. పొత్తులో భాగంగా జనసేన 24 సీట్లు తీసుకోవడంపై వస్తున్న విమర్శలకు ధీటుగా బదులిచ్చారు. 24 పవర్ తెలియడం లేదని ఎన్నికల తర్వాత తమ సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు.  వైసీపీకి జగన్ కు వామనావరాతం చూపిస్తామని, పాతాళానికి తొక్కుతామని హెచ్చరించారు. “మీరు నిజంగా నా మద్దతుదారులైతే నా వ్యూహాన్ని ప్రశ్నించకండి..  వెంట నిలబడండి, నాతో పాటు నడవండి!” అంటూ జనసేన కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.

రాష్ట్రంలో ఒక సైకో ముఖ్యమంత్రి ఉన్నాడంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. విపక్ష నేతలను తిరగనివ్వకుండా చేసేందుకు, మీడియాను కంట్రోల్ చేయడం కోసం జీవో నెం.1 తీసుకువచ్చాడని, మీటింగులను అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడని విమర్శించారు. గత ఎన్నికల ముందు ముద్దులు పెట్టి, ఎన్నికల తర్వాత పిడిగుద్దులు గుద్దే పరిస్థితికి తీసుకువచ్చాడని అన్నారు. జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అని అభివర్ణించారు. బ్లఫ్ మాస్టర్ అంటే పదే పదే అబద్ధాలు చెప్పడం, తాను చేయని పనులను చేశానని చెప్పుకునేవాళ్లు అని వివరించారు. పూర్వం రోజుల్లో కనికట్టు కట్టేవాళ్లు ఉండేవాళ్లు… అలాంటివాడే ఈ జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.

“నిన్ననే కుప్పంలో చూశారు. నా నియోజకవర్గం గురించి పేపర్లో వచ్చింది. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. ముఖ్యమంత్రిగా చేశాను. కుప్పానికి నీళ్లు అంటూ నిన్న ఈ ముఖ్యమంత్రి నాటకాలు వేశాడు. నేరుగా కుప్పం వెళ్లాడు. ట్యాంకర్లలో నీళ్లు తీసుకెళ్లి కాలువల్లో వదిలాడు… గేట్లు కూడా పెట్టాడు. ఓ సినిమా సెట్టింగ్ ను తలపించేలా చేశాడు. నీళ్లు వదిలిపెట్టి వచ్చాడు… కానీ తెల్లవారితే నీళ్లు లేవు అక్కడ. కేవలం 23 గంటల్లో అంతా ముగిసింది. ఇదీ ఈ ముఖ్యమంత్రి విశ్వసనీయత. ఇవాళ తాడేపల్లిగూడెం నుంచి చెబుతున్నా. కుప్పంలో నాకు లక్ష మెజారిటీ ఖాయం. నీ మాటలు కుప్పం ప్రజలెవరూ నమ్మరు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు సీక్వెల్ ఉండదు. ఇక 40 రోజులే మిగిలుంది. వైసీపీ రౌడీలకు 40 రోజుల తర్వాత రియల్ సినిమా చూపిస్తామని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాం. టీడీపీ-జనసేన పొత్తు సూపర్ హిట్. నీ కుట్రలు, నీ కుతంత్రాలు అట్టర్ ఫ్లాప్.. విధ్వంసాలకు ఫుల్ స్టాప్. టీడీపీ-జనసేన కూటమి ఒక విన్నింగ్ టీమ్..వైసీపీ ఒక ఛీటింగ్ టీమ్. అగ్నికి వాయువు తోడైనట్టు పవన్ కల్యాణ్ మనతో చేయి కలిపారు. అగ్నికి వాయువు తోడైతే వైసీపీ బుగ్గి అయిపోతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల నేపథ్యంలో ఒక బాధ్యతగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నామని, 1.30 కోట్ల మంది నుంచి అభిప్రాయ సేకరణ చేసి, ప్రజల్లో ఉండే వాళ్లనే గుర్తించి అభ్యర్థులుగా ప్రకటిస్తున్నామని చెప్పారు. మా అభ్యర్థులను చూశాక జగన్ లో భయం మొదలైందని,  మళ్లీ అభ్యర్థులను మార్చుతానంటున్నాడని పేర్కొన్నారు. “మన అభ్యర్థులు విద్యావంతులు, పేరున్న వాళ్లు… జగన్ అభ్యర్థులు స్మగ్లర్లు, రౌడీలు. వైసీపీ అభ్యర్థులు మళ్లీ గెలిస్తే రాష్ట్రంలో ఎవరికీ రక్షణ ఉండదు. మాఫియా నేతలు కావాలా, ప్రజలకు సేవ చేసే మంచి వ్యక్తులు కావాలా? అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ ఇస్తాం. ఎస్టీల కోసం ఆలోచిస్తాం, మహిళల కోసం ప్రకటన చేస్తాం, రైతుల కోసం ఆలోచిస్తాం, ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తాం. త్వరలోనే టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాం” అని బాబు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్