Sunday, September 8, 2024
HomeTrending NewsPawan: వైసీపీని ఎదుర్కొనేది మేమే: పవన్

Pawan: వైసీపీని ఎదుర్కొనేది మేమే: పవన్

రాబోయే ఎన్నికల్లో తాను ఒంటరిగా వస్తానో, ఉమ్మడిగా వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కక్ష గట్టి తనను ఓడించారని, ఈసారి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవరు అడ్డుపడతారో చూస్తానంటూ సవాల్ చేశారు. పవన్ చేపట్టిన వారాహి యాత్ర నేడు మొదలైంది. కత్తిపూడి లో జరిగిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. జనసేన అంటే వైసీపీకి భయమని అందుకే ఒక్క సీటు కూడా లేని జన సేనను వైసీపీ టార్గెట్ చేసిందన్నారు. భవిష్యత్ లో వైసీపీని ఎదుర్కొనేది జనసేన మాత్రమేనని తేల్చి చెప్పారు.

పరిపాలించేవాడు నిజాయితీపరుడై ఉండాలని, నాయకులు బాధ్యతగా లేనప్పుడు కచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పారు, రాష్ట్రంలో అవినీతి, అరాచకంతో పరిపాలన సాగిస్తున్నారని, ప్రజలను దోపిడీ చేస్తూ తనను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేనని స్పష్టంగా చెప్పిన జగన్ కు కాపులు 60 శాతం ఓట్లేసి గెలిపించారని, కానీ నన్ను కూర్చోబెట్టి కులం గురించి చెబుతారని, చేగువేరా స్ఫూర్తిగా వచ్చిన తాను కులానికే పరిమితం కాబోనని, అంత మాత్రాన కాపు కులాన్ని గౌరవిస్తానని చెప్పారు. కులాన్ని దాటి పారిపోనని, కాకపొతే ఈ సిఎం లాగా ఒకే కులానికి పదవులిచ్చే సంస్కృతిని పాటించబోనని ప్రకటించారు.  అమరావతి ఒక కులానికే అని చెబుతున్న వైసీపీ ఎన్నికల ముందు ఈ మాట ఎందుకు చెప్పలేదని పవన్ ప్రశ్నించారు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని, కానీ ఈ సిఎం మూడు రాజధానుల పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

రాబోయే ఎన్నికల్లో జన సేన పార్టీకి అండగా ఉండాలని పిలుపు ఇచ్చేందుకే యాత్రకు వచ్చానన్నారు. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పార్టీ కోసం పనిచేసే వీర మహిళలు, జన సైనికులు ఉన్నారని అందరూ ప్రజల్లోకి వెళ్లి పార్టీ గురించి చెబితేనే ఉపయోగం ఉంటుందని, తానొక్కడినే తిరిగితే సరిపోదని విజ్ఞప్తి చేశారు. పాతికేళ్ళపాటు ఇదే గడ్డపై ఉంటానని, అద్భుతమైన ప్రభుత్వం తీసుకొచ్చి మీ కల సాకారం చేస్తుందంటూ ప్రజలకు హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్