రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ‘అడుగుకో గుంత – గజానికో గొయ్యి’ లా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇవి ఆషామాషీగా చేస్తున్న రాజకీయ విమర్శలు కావని, నివర్ తుపాను సమయంలో బాధితులను పరామర్శించేందుకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు రహదారుల స్థితిని తాను ప్రత్యక్షంగా చూశానని పేర్కొన్నారు. ప్రభుత్వం నెలరోజుల్లోగా రహదారులను మరమ్మతులు చేయకపోతే జనసేన పార్టీ తరఫున శ్రమదానం చేసి మన రోడ్లను మనమే బాగు చేసుకుందామని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ శ్రమదాన కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని పవన్ వెల్లడించారు. ఈ మేరకు జనసేన పార్టీ తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు.
కరోనా వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని అనుకున్నామని అయితే పరిస్థితి రాను రాను దిగజారుతోందని పవన్ ఆరోపించారు. రోడ్ల పరిస్థితిపై నోరు తెరిచి అడుగుతున్న, ఆందోళన చేస్తున్న జనసైనికులపై అక్రమ కేసులు, అరెస్టులు, లాఠీ ఛార్జ్ లతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, గిద్దలూరు నియోజకవర్గంలో తమ పార్టీ కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్యకు పాల్పడేంతగా వేధించారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రోడ్ల విషయమై బలంగా గొంతు వినిపించాలని నిర్ణయించినట్లు ప్రకటనలో తెలిపారు.
సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ ద్వారా రాష్టంలో రోడ్ల దుస్థితిని సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తెలియజేద్దామని పవన్ సూచించారు. వీటిని చూసిన తరువాతైనా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 2 న శ్రమదానం చేసి రోడ్లను బాగు చేసుకుందామని విజ్ఞప్తి చేశారు.