Pawan Kalyan Challenge రాష్ట్రంలో తన సినిమాలు ఆపాలని, తద్వారా తన ఆర్ధిక మూలాలు దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తన సినిమాలు ఆపేస్తే భయపడతానని అనుకుంటున్నారని, అంత పంతానికి వస్తే ఏపీ మొత్తానికి ఉచితంగా సినిమా చూపిస్తానని వ్యాఖ్యానించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ‘విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్ష’ చేపట్టిన పవన్ కళ్యాణ్ సాయంత్రం తన దీక్ష విరమించారు. అనంతరం జరిగిన సభలో పవన్ ప్రసంగించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైసీపీ కృషి చేయాలని, ప్రైవేటీకరణ ప్రక్రియ ఆపే బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ మరోసారి డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక పరిశ్రమం మాత్రమే కాదని, అది పోరాటాలకు, త్యాగాలకు గుర్తు అని చెప్పారు. ప్రైవేటీకరణ చేస్తామంటే వారి త్యాగాలకు విలువ లేకుండా చేయడమేనని అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ప్రత్యక్ష పోరాటానికి దిగాలని వైసీపీకి ఛాలెంజ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని, వైసీపీ ఎంపీలు స్టాల్ ప్లాంట్ కోసం పోరడగలరా అని ప్రశ్నించారు. కనీసం ప్లే కార్డులు పట్టుకునే సత్తా కూడా వారికి లేదని విమర్శించారు. ప్లాంట్ కు 22 వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తామంటే ఆంధ్ర ప్రదేశ్ కు కూడా ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని, మరి రాష్ట్రాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి వైసీపీ హానికరం అని వ్యాఖ్యానించారు.
కష్టాల్లో ఉన్నప్పుడో, సమస్యల్లో ఉన్నప్పుడో ప్రజలకు జనసేన గుర్తుకు వస్తుందని, అలాగే ఓటు వేసే సమయంలో కూడా తమ పార్టీ గుర్తుకు రావాలని పవన్ అన్నారు. ఓట్లు వేసి గెలిపించకపోయినా తాము ప్రజలకోసం నిలబడుతున్నామని చెప్పారు. వైసీపీ నేతలు తమకు శత్రువులు కాదని, ఆ పార్టీ విధానాలను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం తమ ఉద్దేశం కాదన్నారు. పదవులు లేకుండా ప్రజాసేవకు అంకితమైన వారే తమ పార్టీకి ప్రేరణ అని, వారిలాగే తాము కూడా ప్రజా క్షేమం కోరుకుంటున్నామన్నారు.
అమరావతి రాజధానిగా ఉండాలని తాము చెప్పామని, రెండేళ్ళ తరువాత హోం మంత్రి అమిత్ షా కూడా తిరుపతిలో అదే విషయం చెప్పారని, కానీ రెండేళ్ళు లేటుగా చెప్పారని పవన్ అన్నారు. రాజధాని విషయంలో అయన తీసుకున్న నిర్ణయానికి పవన కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read : పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభం