అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చేతికొచ్చిన పంట నీటి పాలై రైతులు అప్పులపాలయ్యారని… ప్రభుత్వ యంత్రాంగం తాత్సారం చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించినదన్న విషయం క్షేత్ర స్థాయిలో పర్యటన ద్వారా తెలిసిందన్నారు. తాము పర్యటనకు వస్తున్నామని తెలిసి, హడావుడిగా బస్తాలు ఇచ్చి ధాన్యాన్ని ఎత్తించిన వారు ముందుగా ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఒత్తిడి ఉంటే తప్ప బస్తాలు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఎవరో వస్తారు, తిరుగుబాటుగా మారుతుందంటే తప్ప పట్టించుకునే నాథుడు లేదని వ్యాఖ్యానించారు.
తమకు రుణ మాఫీ అవసరం లేదని, పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తే చాలని రైతులు చెబుతున్నారని పవన్ వివరించారు. నిన్నటి పర్యటనలో తనకు సమస్యలు చెప్పుకున్న రైతులపై ఎలాంటి దుశ్చర్యలు చేసినా, వారిని వేధించినా, అక్రమంగా పోలీసు కేసులు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ప్రతి రైతుకూ పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకూ జనసేన పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ధాన్యం సేకరించిన తరువాత డబ్బులు అకౌట్లలో వేసినా వాటిని డ్రా చేసుకోవడంలో కూడా నిబంధనలు పెడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.