రాష్ట్రంలో కూటమి ఘనవిజయం సాధించబోతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మూడు పార్టీలూ త్యాగాలు చేశాయని, తాము కూడా ఐదేళ్లుగా క్షేత్ర స్థాయిలో ఎంతో బలం పుంజుకున్నామని…. 30, 40 సీట్లలో బలమైన అభ్యర్ధులు ఉన్న చోట కూడా పొత్తులో భాగంగా పోటీ చేయలేకపోతున్నామని వివరించారు. మండపేట, రామచంద్రాపురం లాంటి కీలక స్థానాలు కూడా వదులుకోవాల్సి వచ్చిందన్నారు.
పిఠాపురం నుంచి బిజెపి, టిడిపి బలపరిచిన జనసేన అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు గొల్లప్రోలు హైవే ఎంట్రీ నుంచి ఎమ్మార్వో ఆఫీస్, సూరీడు బస్టాండ్, చర్చ్ సెంటర్, బస్టాండ్ మీదుగా ఎంపిడివో ఆఫీసు వరకూ భారీ ర్యాలీతో వచ్చారు. పవన్ వెంట నాగబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ, కాకినాడ ఎంపి అభ్యర్ధి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. నామినేషన్ కు ముందు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ నివాసానికి పవన్ వెళ్ళారు. వర్మ సతీమణి పవన్ కు మంగళ హారతి ఇచ్చి ఆశీర్వాదం అందించారు.
నామినేషన్ అనంతరం పవన్ మాట్లాడుతూ.. పిఠాపురంలో వర్మ కూడా తన కోసం టికెట్ త్యాగం చేశారని, ఆయన త్యాగం వ్యక్తిగతం కాదని రాష్ట్రం కోసం చేశారని కొనియాడారు. భవిష్యత్తులో ఆయనకు కీలక పదవి వస్తుందన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని స్పష్టం చేశారు.