Sunday, January 19, 2025
HomeTrending Newsపిఠాపురం నుంచి పవన్ తప్పుకుంటారేమో..!

పిఠాపురం నుంచి పవన్ తప్పుకుంటారేమో..!

పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతటా ప్రచారం చేయాలి కాబట్టి, చివరకు పిఠాపురంలో కూడా ఆయన తప్పుకొని మాజీ ఎమ్మెల్యే వర్మను జనసేన నుంచి పోటీ చేయిస్తారేమోనని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. పవన్ కు రెండున్నరేళ్ళు సిఎం పదవి ఇవ్వాలన్న జన సైనికులు, వీర మహిళల డిమాండ్ నుంచి.. ఆ తరువాత 50-60 సీట్ల డిమాండ్ కు తగ్గారని.. చివరకు 21 సీట్లకు దిగజారారని విస్మయం వ్యక్తం చేశారు. ఈ సీట్లలో కూడా 10-12 మంది టిడిపి నుంచి వచ్చిన వారికే సీట్లు ఇచ్చారని… భీమవరం, అవనిగడ్డ లో కూడా ఇలాగే చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు తమ పార్టీ వాళ్లనే కూటమిలోని ఇతర రెండు పార్తీల్లోకి పంపి అక్కడ టిక్కెట్లు  ఇప్పిస్తున్నారని పేర్కొన్నారు.  అనపర్తి నుంచి టిడిపినేత కృష్ణారెడ్డిని బిజెపిలో పంపి అక్కడి నుంచి  పోటీకి దించుతున్నారని ఎద్దేవా చేశారు. మొత్తం అన్ని సీట్లూ తన పట్టులోనే ఉండాలని బాబు భావిస్తున్నారని అన్నారు. అసలు విపక్ష కూటమి చంద్రబాబు కోసమే ఏర్పడినట్లుందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీలో తండ్రీ కొడుకు రాజకీయం నడుస్తోందని… తండ్రి కొంతమందికి టిక్కెట్ల హామీ ఇచ్చారని… కొడుకు లోకేష్ తన వారికి కొన్ని టిక్కెట్లు అనుకున్నారని కానీ కూటమి అయ్యే సరికి అది కుదరలేదని… కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి లాగా మారిందన్నారు.  2014లో ఇదే కూటమి ప్రజలకు ఎన్నో హామీలిచ్చి వాటి అమల్లో విఫలమైందని, ఇప్పుడు కూడా బాబు ప్రజలకు ఎన్నో హామీలిస్తున్నారని.. అసలు కూటమికి ఓ అజెండా అంటూ లేకుండా పోయిందని,  అతుకుల బొంతలా మారిందని ఇలాంటి వారిని ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.

జగన్ ను ఎదుర్కోవడం తమ వల్ల కాదని అర్ధమైందని, అందుకే చంద్రబాబు, పవన్ లు నోటికొచ్చినట్లు తిడుతున్నారని, తిట్లపై వాళ్ళకే పేటెంట్ ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని సజ్జల అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారని… విపరీతంగా డబ్బులు పంచుతున్నారని.. టిడిపి ఎన్నారైలు వచ్చి వారే స్వయంగా డబ్బులు పంచాలని చూస్తున్నారని సజ్జల ఆరోపించారు.  ఎందుకు చంద్రబాబుకు అధికారంలోకి తీసుకురావాలో చెప్పకుండా.. కేవలం డబ్బు మూటలతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు. తాము ధర్మ యుద్దానికే కట్టుబడి ఉన్నామని…  ఎన్నారైల డబ్బు పంపిణీపై అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు అలాంటి చర్యలను పార్టీ, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని సజ్జల విజ్ఞప్తి చేశారు.

కూటమి అధికారంలోకి రావాలని చిరంజీవి భావిస్తున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఒకే స్వభావం ఉన్నవాళ్ళు అందరూ ఒకే గూటికి చేరతారంటూ మాట్లాడితే దానిపై పవన్ అంతగా ఎందుకు స్పందిచాల్సి వచ్చిందో అర్ధం కాలేదని సజ్జల వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్