జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. జూబ్లీ హిల్స్ లోని బాబు నివాసంలో దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు, ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలూ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
ఈనెల మొదట్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటించి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు, ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించే సంస్థాగత కార్యదర్శులతో సమావేశమయ్యారు. బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ తో రెండుసార్లు కలుసుకొని రాబోయే ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై చర్చలు జరిపారు. వైసీపీ ఓటమి లక్ష్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తామని చెప్పిన పవన్, బిజెపి-టిడిపి-జనసేన పొత్తుదిశగా బిజెపి పెద్దలను ఒప్పించే బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబు రిపబ్లిక్ టివి ఇంటర్వ్యూ లో మోడీ విధానాలకు జై కొట్టడం ద్వారా ఎన్డీయేలో మళ్ళీ చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు పరోక్షంగా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. నేటి సమావేశంలో ఈ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయని సమాచారం.