రాష్ట్ర ప్రభుత్వ నెలవారీ ఆదాయంలో పెరుగుదల ఉన్నా జీత భ్యతాలు కూడా చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడంలో అర్ధం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆదాయం, తెస్తున్న అప్పులు ఏమైపోతున్నాయని ప్రశ్నించారు. ఈ మేరకు అయన ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు నెలవారీ పెన్షన్ ఇవ్వకపోతే ఎలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు డి.ఏ.లు బకాయి ఉందని, నిరంతరం డ్యూటీలో ఉండే పోలీసులకు 11 నెలలుగా టి.ఏ. అందడంలేదని అయన లేఖలో పేర్కొన్నారు. జీతం ఇవ్వడమే ఆలస్యం చేస్తే ఇక టి.ఏ.; డి.ఏ., పీఆర్సీ లు అడగరన్నట్లుగా ప్రభుత్వ వ్యవహారం ఉందని అయన ఎద్దేవా చేశారు. జీతం వస్తే అదే పదివేలు అని ఉద్యోగులు భావించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉందని మండిపడ్డారు.
ఉద్యోగులు దశాబ్దాల పాటు సర్వీసు చేసి విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటారని, వారి వైద్య ఖర్చులకు పెన్షన్ డబ్బులే ఆధారమని, అలాంటి పెన్షన్ ను సకాలంలో ఇవ్వకపోతే వారు ఎంతో మానసిక వేదనకు గురవుతారని లేఖలో పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి కూడా రిటైర్డ్ ఉద్యోగి కావడంతో తనకు వారి ఆత్మాభిమానం స్వయంగా తెలుసని అన్నారు.
దీనితో పాటు, “ఎన్ని వాగ్దానాలు చేసినా ఎన్ని అరుపులు అరిచినా రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా ‘సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు’ ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని ‘వైసీపీ ప్రభుత్వం’ మరిచినట్టుంది” అంటూ పవన్ ట్వీట్ చేశారు.