Monday, January 20, 2025
HomeTrending Newsపవన్ సమాధానం చెప్పాలి: భరత్ డిమాండ్

పవన్ సమాధానం చెప్పాలి: భరత్ డిమాండ్

కాపు సామాజిక వర్గం, అభిమానులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంటే, పవన్ మాత్రం చంద్రబాబు సీఎం కావాలనే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇది నయవంచన కాదా అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. కార్తీక సోమవారం సందర్భంగా రాజమండ్రి గోదావరి ఘాట్లు, ఆలయాల్లో ఏర్పాట్లను భరత్  స్వయంగా పరిశీలించి పుష్కర ఘాట్ వద్ద మీడియాతో మాట్లాడారు. పవన్ తీరుపై కాపు సామాజిక వర్గం జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చంద్రబాబు కాపు సంక్షేమానికి వెయ్యి కోట్ల నిధులు కేటాయించి, ఆ నిధులను మళ్ళించారనిమ్, టీడీపీ హయాంలో కాపుల సంక్షేమానికి ఏ విధంగానూ కృషి చేయలేదన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ కాపు నేస్తం పేరుతో కాపు మహిళల బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున గత మూడేళ్ళలో రూ.45 వేలు నేరుగా జమ చేశారన్నారు. ఏటా కాపు నేస్తం కింద రూ.2 వేల కోట్ల పైచిలుకు నిధులు వెచ్చిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఏ విధంగా కాపు సామాజిక వర్గాన్ని మోసం చేశారో ప్రజలు గ్రహించాలని, అటువంటి వ్యక్తితో పవన్ ఎందుకు కలవాల్సివచ్చిందో అందరికీ కాకపోయినా కనీసం కాపు సామాజిక వర్గీయులకైనా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

2014లో పవన్ పార్టీ పెట్టి పోటీ చేయలేదని, 2019లో ప్రభుత్వ (టీడీపీ) వ్యతిరేక ఓట్లు చీల్చడానికి ఎన్నికలలో పోటీచేశారన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీతో కలిసి పోటీ చేస్తానంటున్నారు..చంద్రబాబు కోసం కాదా పవన్ ఈ రాజకీయ డ్రామాలు అంటూ భరత్ సూటిగా ప్రశ్నించారు. కులాల పేరుతో రాజకీయాలు చేయడం సీఎం జగన్ కు చేతకాదన్నారు. కుల, వర్గ రహితంగా అన్ని వర్గాల వారూ ఆర్థికంగా చైతన్యవంతులు కావాలన్నదే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు, ఆ సామాజిక ప్రముఖులు సోమవారం రాజమండ్రిలో సమావేశమై వివిధ అంశాలపై చర్చించబోతున్నట్టు ఎంపీ భరత్ తెలిపారు.

ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపర్చాలనే ఒకే ఒక సంకల్పం సీఎం జగన్మోహన్ రెడ్డిదని ఎంపీ చెప్పారు. చంద్రబాబు, జగన్ పాలనలలో ఎవరు కాపుల సంక్షేమానికి, వారి ఆర్థిక పరిపుష్టికి కృషి చేశారో ఆలోచించాలని ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంట వైసీపీ నేతలు టీకే విశ్వేశ్వరరెడ్డి, పోలు విజయలక్ష్మి, ఇన్నమూరి ప్రదీప్ కుమార్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్