వైఎస్సార్సీపీ నేతలతో తిట్టించుకోక పొతే పవన్ కళ్యాణ్ కు నిద్ర పట్టదని, అప్పుడప్పుడూ ఏపీకి వచ్చి నాలుగు తిట్లు తిని వెళ్తుంటారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడేవారు ధైర్యం లేని వారని, ధైర్యం ఉన్నవారు ఎవరూ ఇలా మాట్లాడరని వ్యాఖ్యానించారు. అన్నింటికీ తెగించి వచ్చానని చెబుతున్నారని, అంటే ఏమైనా పాకిస్తాన్ యుద్ధానికి, అడవుల్లో వేటకు వెళుతున్నారా అని ప్రశ్నించారు.
రాబోయే ఎన్నికలు నిజంగా పేదలకు, పెత్తందార్లకు జరిగే ఎన్నికలేనని…. పెత్తందార్లు, చంద్రబాబు, లోకేష్ ల పల్లకి పవన్ మోస్తున్నారని, వారిని భుజాన పెట్టుకొని విప్లవం, పోరాటం గురించి మాట్లాడే హక్కు లేదని దుయ్యబట్టారు, సిఎం జగన్ పేదల పక్షాన ఉన్నారని రాంబాబు స్పష్టం చేశారు. బాబు సిఎం కావాలన్నదే పవన్ లక్ష్యమని డబ్బు కోసం పవన్ ఓ అద్భుతమైన గేమ్ ఆడుతున్నారని, తన కులాన్ని అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నారని…. పవర్ బాబు కు ఇచ్చి, డబ్బు తీసుకుంటారని ఆరోపించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే కొంతవరకూ సహించగలమని, ఇంకా ఎక్కువగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారని, వేషాలు వేయవద్దని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే అందరి బండారం బైట పెడతా అంటున్నారని, దమ్ముంటే ఇప్పుడే బైట పెట్టాలని సవాల్ చేశారు.
వారాహి ఓ ఆద్భుతమైన మహిమ గల అమ్మవారు అని, అలాంటి పేరు పెట్టుకున్న ఓ వాహనంపైకి ఎక్కి బూతులు మాట్లాడుతున్న పవన్ ఓ మ్యాడ్ డాగ్ అంటూ తీవ్రంగా ప్రతిస్పందించారు. అందుకే ఆ వాహన్నాన్ని పంది అంటున్నామని చెప్పారు.