Pawan Must Know The Governments Initiatives On Steel Plant Minister Seediri :
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదట చంద్రబాబు ధృతరాష్ట్ర కౌగిలి నుంచి బైటకు రావాలని, సొంతంగా, స్వేఛ్చగా రాజకీయాలు చేయగలిగితేనే ఆయనకు భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు సలహా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటించి దాదాపు తొమ్మిది నెలలు అవుతుంటే ఇప్పటిదాకా ఏం చేస్తున్నారని, గుడ్డి గాడిదకు పళ్ళు తోముతున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నట్లు పవన్ మాట్లాడడం సరికాదన్నారు. ప్లాంట్ ను ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి మీకు తెలియదా, లేకపోతే మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చినవారు ఈ విషయం మీ చెవిలో వేయలేదా? అని నిలదీశారు. ఈ తొమ్మిది నెలలు సినిమాలు, షూటింగ్ లు అని తిరిగి, రాష్ట్రంలో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఇప్పుడు కొత్తగా వచ్చి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నామని చెప్పడంలో అర్ధం లేదన్నారు.
పవన్ తనకు తాను చాల గొప్పవాడినని, దైవాంస సంభూతుడినని అనుకుంటారని, ఇలా అడిగితే అలా తనకు మోడీ, అమిత్ షా లు అప్పాయింట్మెంట్ ఇస్తారని చెప్పుకుంటారని, అలాంటప్పుడు ప్రధానితో మాట్లాడి స్టీల్ ప్లాంట్ గురించి, ఇక్కడి ప్రజల సెంటిమెంట్ గౌరవించే విధంగా మాట్లాడి ఒప్పించాలని సూచించారు. ఇప్పుడు కొత్తగా వచ్చి ‘నేను పోరాటం చేస్తా మీరు అఖిల పక్షం వేయండి’ అనడం హాస్యాస్పదమనారు. మీరు చెబితే మేం సమావేశం పెట్టాలా అని అడిగారు.
స్టీల్ ప్లాంట్ పై కేంద్రప్రభుత్వం ఏదైనా సానుకూల నిర్ణయం ఇస్తుందేమో, ఆ క్రెడిట్ వైఎస్సార్సీపీ ఖాతాలోకి పడకూడదనే చంద్రబాబు, మీరు కలిసి ఆడుతున్న నాటకంగా అనిపిస్తోందని పవన్ ను ఉద్దేశించి అన్నారు.
Must Read :పోప్ తో మోడీ భేటి