పవన్ కళ్యాణ్ సంసారం బిజెపితో, సహజీవనం తెలుగుదేశం పార్టీతో చేస్తున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. నిన్న విశాఖలో పవన్ ప్రసంగం అసూయ, విద్వేషం, విషం, అహంకారంతోనే సాగిందని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఏమి చేస్తామనేదానిపై ఏమీ మాట్లాడకుండా, ఎలాంటి స్కీమ్ లు అమలు చేస్తామో చెప్పకుండా, కేవలం బాబు స్కీమ్ ప్రకారమే, ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతున్నారని… ఆయనకు ఓ విధానం, సిద్దాంతం, స్థిరత్వం అంటూ లేదని మండిపడ్డారు. విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
పవన్ కు పొలిటికల్ ప్రొడ్యూసర్ చంద్రబాబు అని, తనను నమ్ముకుని వచ్చిన వారిని వదిలేసి బానిస బతుకు బతుకుతున్నారని ఘాటుగా ఆరోపణ చేశారు. జగన్ ను అధికారంలో నుంచి దించడమే తప్ప, తనను సిఎం చేయమని ఆయన అడగడం లేదని, కేవలం బాబు కోసమే ఆయన పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పై అంత అసూయ ఎందుకో అర్ధకావడం లేదన్నారు. 175 నియోజక వర్గాలకూ పోటీ చేస్తారా అనే విషయం మీడియా, ప్రజలు పవన్ ను అడగాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు అపారమైన సేవలు అందిస్తోన్న వాలంటీర్లపై ఆయన చేస్తున్న విమర్శలు సహేతుకం కాదని, ఎక్కడో ఏదో ఒక సంఘటన జరిగితే మొత్తం వ్యవస్థకు దీన్ని ఆపాదించడం సరికాదన్నారు. మహిళలంటే అంత గౌరవం ఉంటే… గతంలో ముద్రగడ పద్మనాభం సతీమణిని బాబు ప్రభుత్వం అవమానపరిచినప్పుడు, విశాఖలో గంజాయి పై నాడు టిడిపి మంత్రి స్వయంగా ఆరోపణలు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని అమర్నాథ్ నిలదీశారు.
పవన్ ఏకైక లక్ష్యం జగన్ మాత్రమేనని, ఆయనపై విమర్శలు చేస్తే నాయకుడు అయిపోతానని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర దగ్గర పవన్ కు పలుకుబడి లేదని, బాబు నుంచి రాబడి కోసమే మాట్లాడుతున్నాడని అన్నారు. కేంద్రానికి చెబుతా అంటూ అంటున్నారని, కేంద్రానికి కాకపొతే అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు, రష్యా లో పుతిన్ కు చెప్పుకోవచ్చని ఎదురుదాడి చేశారు. నిజంగా పలుకుబడి ఉంటే విశాఖ ప్రైవేటు పరం కాకుండా ఆపాలని సవాల్ చేశారు. నీలాంటి రాజకీయ పిల్ల బచ్చాలకు భయపడే రకం జగన్ కాదన్నారు.
తాము సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరు మీదే ఇస్తున్నామని, సాయంత్రానికి మద్యం తాగుతున్నారని పవన్ ఆరోపించారని, అంటే మహిళలు మద్యం తాగుతున్నారని ఆయన ఉద్దేశమా అని అమర్నాథ్ నిలదీశారు. పవన్ ను బాబా అని మంత్రి అభివర్ణించారు, బాబా అంటే బాబుగారి బానిస అంటూ వివరణ ఇచ్చారు. పవన్ కథానాయకుడైతే, జగన్ ప్రజానాయకుడని అన్నారు.