అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడూ వింటూ ఉండేవాళ్లమని కొన్నాళ్ళుగా అనకాపల్లి కోడిగుడ్డుకు ఫేమస్ అయ్యిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను ఉద్దేశించి చమత్కరించారు. అనకాపల్లి ఒక డిప్యూటీ సిఎం, అయిదు పోర్ట్ ఫోలియోల మంత్రిని, ఒక ప్రభుత్వ విఫ్ ను ఇచ్చిందని…. కానీ ఒక కిలోమీటర్ రోడ్ కూడా వేయలేకపోయారని విమర్శించారు. జ్వరం కారణంగా నాలుగురోజుల విరామం అనంతరం నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ అనకాపల్లిలో వారాహి యాత్రలో ప్రసంగించారు. టిడిపి, బిజెపి బలపరిచిన అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్ధి కొణతాల రామకృష్ణ, టిడిపి, జనసేన బలపరిచిన బిజెపి అనకాపల్లి ఎంపి అభ్యర్ధి సిఎం రమేష్ లను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పవన్ మాట్లాడిన ముఖ్యాంశాలు…
- నా ఒక్కడి ప్రయోజనాల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు
- రాజకీయ పార్టీని నడపడం అంత సులభం కాదు
- మంత్రి పదవి కోరుకుంటే ఎప్పుడో వచ్చేది
- నాకు పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం
- జగన్ సిఎం కాదు, ఒక సారా వ్యాపారి, ఇసుక దోపిడీదారు
- అనకాపల్లిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
- శారదా నది తీరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దుతాం
- తుమ్మలపాలె చక్కర పరిశ్రమ తెరిపిస్తామని గతంలో హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని అమ్ముతున్నారు
- అనకాపల్లి బెల్లం పరిశోధనా కేంద్రం ఉంది, కానీ మార్కెటింగ్ లో ముందుకు తీసుకు వెళ్ళలేకపోతున్నాం, దానిపై కూటమి దృష్టి సారిస్తుంది
- ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు కృషిచేసిన వ్యక్తి కొణతాల రామకృష్ణ
- అలాంటి కొణతాల అసెంబ్లీలో ఉంటే ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రానికే ఎంతో ఉపయోగం
- నేను సాధారణ ఉద్యోగి కుమారుడిని
- ఉద్యోగులకు పెన్షన్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు
- కూటమి అధికారంలోకి రాగానే సీపీఎస్ కు ఓ పరిషారం చూపుతాం
- ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన ఏడాది లోపే ఉద్యోగులకు న్యాయం చేస్తాం
- కూటమి అధికారంలోకి రాగానే ముందుగా చెత్తపన్ను రద్దు చేస్తాం