క్రిమినల్ గ్యాంగులను, చైన్ బ్యాచ్ ను పులివెందుల, ఇడుపులపాయలోనే ఉంచుకోవాలని ఆ సంస్కృతిని గోదావరి జిల్లాలకు తీసుకు రావొద్దని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా, రోడ్లు ఎందుకు బాగాలేవని ప్రశ్నించినా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అమలాపురం నుంచి దిండి వెళ్తుంటే మార్గమధ్యంలో తనపై నలుగురు వ్యక్తులు రాళ్ళతో దాడులు చేయించారని చెప్పారు. జన సేన వారాహి విజయ యాత్రలో భాగంగా రాజోలులో జరిగిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కొందరు అభిమానులు ముద్రగడ ఫోటో తో ‘కుల ద్రోహి’ అంటూ బ్యానర్ ను ప్రదర్శించగా పవన్ వారిని వారించారు. ‘పెద్దలను గౌరవించాలని, వారు ఏదైనా ఒక మాట అంటే దాన్ని తీసుకోవా’లని ఇలాంటివి సరికాదని అన్నారు.
శ్రీవాణి ట్రస్ట్ పై టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వైట్ పేపర్ విడుదల చేశారని, కానీ ఈ ప్రభుత్వంపై తనకు చిత్తశుద్ది లేదని, రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది అర్చకులు ఉన్నారని, వారి జీవితాలు కనాకష్టంగా ఉన్నాయని… హిందూ భక్తులు దేవాలయాలకు విరాళాలు ఇస్తున్నారని, వాటిని పేద అర్చకులకు ఇవ్వాలని సూచించారు. అంతేకానీ ఈ డబ్బులతో పక్క రాష్ట్రాల్లో దేవాలయాలు కడుతున్నామంటే అది సరికాదని అన్నారు. గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా తాను చూస్తానని, ఇది తన కర్తవ్యం, ధర్మం అని పవన్ ప్రకటించారు. ఈ ప్రాంతం నుంచి ఇసుక దోపిడీ చేయడం తప్ప అభివృద్ధి చేయలేదని పవన్ విమర్శించారు. రాజోలు ఎల్ఐసి సెంటర్ లోని బైపాస్ రోడ్డు ను 15 రోజుల్లోగా మరమ్మతులు చేయాలని, లేకపోతే తాము శ్రమదానం చేసి తామే రోడ్డు వేస్తామని వెల్లడించారు.