Sunday, January 19, 2025
HomeTrending Newsప్రజలకు క్లారిటీ ఉంది: సుచరిత

ప్రజలకు క్లారిటీ ఉంది: సుచరిత

పవన్ కళ్యాణ్ తన భాషపై ఒకసారి ఆలోచించుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు. అయన ఎప్పుడు ఎక్కడుంటారో తెలియని పరిస్థితి నెలకొని ఉందని, తోలు తీస్తానంటూ మాట్లాడుతున్నారని, తోలు తీయించుకోవడానికి ఎవరు రెడీగా ఉంటారని ఆమె ప్రశ్నించారు.

పవన్ రెండుస్థానాల్లో నిలబడితే రెండు చోట్లా ప్రజలు ఆయన్ని తిరస్కరించారని గుర్తు చేశారు.  వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఆదరించేదీ లేనిదీ ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కు వచ్చిన ఒకటి, రెండు సీట్లు కలుపుకొని రెండు పార్టీలు ఎంపీపీ పదవులు ఎలా పంచుకున్నారో అందరికీ తెలుసన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నాయని అందరికీ అర్థమైపోతుందని సుచరిత ఎద్దేవా చేశారు.

రాజకీయ పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, పవన్ కళ్యాణ్ నిలకడలేని వ్యక్తి అనేది అయన మాటల్లోనే అర్థమవుతుందన్నారు. ఒకసారి లెఫ్టిస్టులతో, మరోసారి బీజేపీతో, ఇంకోసారి టిడిపితో అయన కలిసి పనిచేస్తారని…ఆయన రాజకీయ ప్రస్థానంపై ఆయనకే స్పష్టత లేదని, ప్రజలకు మాత్రం పూర్తి క్లారిటీ ఉందని మేకతోటి సుచరిత అన్నారు.

తమ పాలన ఎలా ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని,  అధికారంలోకి రావాలంటే పార్టీ విధి విధానాన్ని ప్రజలకు  చెప్పాలని,  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పి అధికారంలోకి వచ్చారని సుచరిత పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్