Your Own Policy: జనసేన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ మరో పార్టీ బిజెపిని రోడ్ మ్యాప్ అడగడం ఏమిటని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. సాధారణంగా ప్రతి పార్టీకీ ఓ విధానం, కార్యాచరణ ఉంటాయని దాని ప్రకారం ముందుకు వెళతారని, కానీ బిజెపి రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నానని పవన్ చెప్పడం వింతగా ఉందన్నారు. చంద్రబాబుతో పొత్తుపై పవన్ కళ్యాణ్ పునరాలోచించాలని, సిఎం అభ్యర్ధిగా పవన్ ను ప్రకటిస్తేనే పొత్తుకు అంగీకరించాలని బాలినేని సలహా ఇచ్చారు. గత ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించిందని, కానీ తమ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అయినా గత ఎన్నికల్లో చంద్రబాబు పాలన బాగాలేదని వామపక్షాలతో కలిసి పోటీ చేసిన పవన్ మళ్ళీ ఇప్పుడు బాబుతో పొత్తు పెట్టుకు సిద్ధపడడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.
రెండున్నరేళ్ళ తరువాత మంత్రివర్గాన్ని మారుస్తానని సిఎం జగన్ మొదట్లోనే చెప్పారని, అందువల్ల పదవులు పోతాయన్న బాధ ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, సిఎం జగన్ ఏ బాధ్యత అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తానని వెల్లడించారు. రెండేళ్ళల్లో ఎన్నికలు ఉన్నందున దానికి అనుగుణంగా ఎలక్షన్ టీమ్ ను మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో సిఎం ఉన్నారని బాలినేని చెప్పారు.