White Paper: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ పొంతన లేని ప్రకటనలు, మాటల గారడీ చేసున్నారని టిడిపి ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యవుల కేశవ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉంటే ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఎందుకు సరిగా ఇవ్వలేక పోతున్నారని నిలదీశారు. బుగ్గనకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, వాస్తవాలు నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఆర్ధిక వ్యవస్థను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టారని, చేసిన తప్పులను గారడీ మాటలతో బుకాయించే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం అప్పులకు ఈఎంఐ కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి అప్పులిచ్చేందుకు ఏ బ్యాంకూ ముందుకు వచ్చే పరిస్థితి లేదని, అన్ని అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పయ్యవుల పేర్కొన్నారు.
ఆర్థిక స్థితిపై బుగ్గన నిన్న విడుదల చేసిన ప్రకటన తన కాళ్ళకు తానే దణ్ణం పెట్టుకొని దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించుకున్నట్లు ఉందని కేశవ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంత, మూల ధన వ్యయం, రెవెన్యూ వ్యయం, జీతభత్యాలు, సంక్షేమం కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కొన్ని పథకాల్లో అయితే ఆ పథకం కోసం పెడుతున్న ఖర్చు కంటే పత్రికల్లో ప్రకటనల కోసం పెడుతున్న ఖర్చే ఎక్కువగా ఉంటోందని చెప్పారు. రాష్ట్రంలో వాస్తవ ఆర్ధిక పరిస్థితిపై ఒక్కో సంస్థకు ఒక్కో విధంగా వివరాలు అందిస్తున్నారని, సిఎం డ్యాష్ బోర్డులో ఒక్క ఎక్సైజ్ శాఖ ఆదాయం తప్ప ఇతర వివరాలు ఏవీ లేవని కేశవ్ విమర్శించారు. కొత్త పెట్టుబడులు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, ఇంకా ఆదాయం ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు.
Also Read : ఏడాది క్రితమే ప్రక్రియ ప్రారంభం: బాలినేని