Monday, November 25, 2024
HomeTrending NewsPeddireddy: మీ హయంలోనే ఇసుక దోపిడీ: పెద్దిరెడ్డి

Peddireddy: మీ హయంలోనే ఇసుక దోపిడీ: పెద్దిరెడ్డి

ఇసుకపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని  రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బాబు సిఎంగా ఉండగా ఆయన ఇంటి వెనుకే ఇసుక దోపిడీ జరిగిందని, దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా తీర్పు ఇచ్చిందని, వారి హయంలో  ఇసుక విధానంలో 19 సార్లు మార్పులు చేశారని, ఉచిత ఇసుక పేరుతో టిడిపి నేతలు దోచుకున్నారని మండిపడ్డారు. ఇసుక విషయమై చంద్రబాబు చేసిన ఆరోపణలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రి ప్రతిస్పందించారు.  వంశధార, నాగావళి, పెన్నా నదుల్లో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీకి టిడిపి నేతలు పాల్పడ్డారని, నారా లోకేష్ కు ప్రతినెలా రూ. 500 కోట్లు ముడుపులు అందినట్లు వార్తలు కూడా వచ్చాయని గుర్తు చేశారు.

తాము  ఇసుక పాలసీని పారదర్శకంగా రూపొందించామని, టెండర్ల ప్రక్రియలో అత్యధిక బిడ్ వేసిన జేపీ వెంచర్స్ కు  కాంట్రాక్టు ఇచ్చామని, దానితో మాత్రమే తాము ప్రిన్సిపల్ అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు. ఇటీవలే మరో ఏడాదిపాటు ఈ కాంట్రాక్టును పొడిగించామన్నారు. చంద్రబాబు నాలుగువేల కోట్ల రూపాయలు ఇస్తే ఆయనకే టెండర్ కేటాయిస్తామన్నారు. తమ ప్రభుత్వంలో ఇప్పటి వరకూ రూ. 3,825 కోట్ల ఆదాయం లభించిందని వెల్లడించారు. బాబు హయంలో ఈ ఆదాయం ఎటుపోయిందని ప్రశ్నించారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఇసుకలో 10వేల కోట్లు దోచుకున్నారంటూ బాబు విమర్శలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రతివారం ఇసుక ధరల పట్టికను పత్రికల్లో ప్రకటిస్తున్నామని, గతంలో బాబు ఉచిత ఇసుక ఎవరికి ఇచ్చారో చెప్పాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు.

పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లిన ప్రతిసారీ ఓడిపోయాననే అపోహలో చంద్రబాబు ఉన్నారని, అందుకే బిజెపి, జనసేన పార్టీలతో పోత్తులకు వెంపర్లాడుతున్నారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ సింగిల్ గానే ఎన్నికలకు వెళ్తారన్నారు.  రాష్ట్రంలో ఎక్కడా దొంగ ఓట్లు చేర్చడంలేదని,  లెక్కలు పరిశీలిస్తే 60 లక్షల ఓట్లు అదనంగా ఉన్నట్లు తేలిందని, వాటిని తొలగించే ప్రక్రియ మాత్రమే జరుగుతోందని పేర్కొన్నారు. కుప్పంలో కూడా 12 వేల దొంగ ఓట్లు తొలగించామని, అప్పుడు చంద్రబాబు కూడా అభ్యంతరం తెలపలేదని అన్నారు. బాబు అధికారంలో ఉన్నప్ప్పుడే 60 లక్షల ఓట్లు అక్రమంగా చేర్చారన్నారు. వీటిపై అభ్యంతరాలు వచ్చినందునే తొలగిస్తున్నారన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్