పేద పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతూ మాట్లాడుతుంటే పట్టరాని సంతోషంగా ఉందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. నవరత్నాల ద్వారా వందకు 80 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. రాజకీయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సిఎం జగన్ అండగా ఉన్నారని, 17 మంత్రి పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంత మంది లేరని, ఎస్సీనైన తనను శాసనమండలి చైర్మన్‌గా, బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని శాసనసభాపతిగా నియమించారని వివరించారు. స్థానిక సంస్థల్లో ఓసీ స్థానాల్లో కూడా ఎస్సీలు, బీసీలకు అదనంగా జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లుగా ఇచ్చిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్ర 11వ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ నందిగం సురేష్, శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు, పార్టీ నేతలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
మంత్రి చెల్లుబోయిన మాట్లాడిన ముఖ్యాంశాలు:
- చంద్రబాబు నాయుడు అంటే అబద్ధం. నిజం మాట్లాడని వాడు. నయవంచకుడు.
- చంద్రబాబు పాలనలో మనవాళ్లను కులవృత్తులకే పరిమితం కావాలన్నాడు.
- 2004 తర్వాత రాజశేఖరరెడ్డి వచ్చి ఆలోచించాడు. ఇవాళ మన పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. విదేశాలకు వెళ్తున్నారు. రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్ పెట్టకపోతే ఇది సాధ్యమయ్యేదా?
- విభజిత రాష్ట్రంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికి రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి అందర్నీ మోసగించాడు.
- ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని ఇచ్చాడా? నిరుద్యోగ భృతి ఇచ్చాడా?
- రైతులకు రుణాలు మాఫీ చేశాడా? రూ.87 వేల కోట్లు మాఫీ అని రూ.15 వేల కోట్లే చేశాడు.
- అబద్ధం ఆడితే వచ్చే అధికారం తనకొద్దని జగనన్న చెప్పాడు.
- రాజకీయ నాయకుడు నిజమే చెప్పాలని చెప్పిన ఏకైక నాయకుడు జగనన్న.
- చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేశాడా? కానీ జగనన్న నాలుగు దఫాల్లో నాలుగు దఫాల్లో మీ ఖాతాల్లో వేస్తున్నాడు. అందుకే జగన్ నిజం, చంద్రబాబు అబద్ధం.
- మొన్నటిదాకా సర్పంచ్ కూడా కాని నేను ఇవాళ రాష్ట్ర మంత్రి అయ్యానంటే కారణం జగనన్న
సాలూరులో….
గిరిజనులకు రెండు సార్లు ఉప ముఖ్యమంత్రి పదవిని జగన్ కట్టబెట్టగా, చంద్రబాబు కేబినెట్ లో అసలు గిరిజనులకు ప్రాతినిధ్యం లేకుండా చేశారని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర మండిపడ్డారు. ఎస్టీలకు గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు జగన్ రాజకీయ అధికారం కల్పించారని వివరించారు. సంక్షేమ పథకాల అమలులో జగన్ కు, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించారని కోరారు. బాబు ఇచ్చిన హామీల్లో వేటినీ నెరవేర్చలేదని, చివరకు గిరిజనులకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేక మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు మేలు చేస్తున్నారు… ఎవరు మంచి చేస్తున్నారు.. ఎవరు సంక్షేమం కోసం పాటుపడుతున్నారో ప్రజలు గుర్తించాలన్నారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే వెనుకబడిన వర్గాలకు మేలు జరుగుతుందని, ఆయనకు తోడుగా, అండగా ఉండాలని రాజన్నదొర కోరారు.
సామాజిక సాధికార బస్సు యాత్రకు పార్వతీపురం మన్యం జిల్లా సాలురులో అఖండ స్వాగతం లభించింది. నియోజకవర్గానికి చేరుకున్న నేతలకు అడగుడుగునా జనం నీరాజనం పట్టారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ కోర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు అప్పలనర్సయ్య, పుష్పశ్రీవాణి లు కలసి పరిశీలించారు. సాలూరు కూడలిలో జరిగిన బహిరంగ సభకు తరలివచ్చిన జనంతో పట్టణం నలు వీధులు కిక్కిరిసిపోయాయి. ఈ సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా పాల్గొన్నారు.
కనిగిరిలో….
సామాజిక సాధికారత విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే ఒక రోల్‌మోడల్‌గా నిలిచారని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు అన్నారు. ఎంతో ఆదర్శవంతంగా పనిచేస్తున్న జగనన్న వల్ల పార్లమెంటు, రాజ్యసభల్లో వెనుకబడిన వర్గాలవారు ఉన్నారని, ఎనిమిదిమంది రాజ్యసభ ఎంపీలలో… నలుగులు బీసీలవారే అని గర్వంగా చెప్పగలుగుతామని పేర్కొన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని పార్లమెంటులో మాట్లాడేలా చేసిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని, కులగణన చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని గట్టిగా నమ్మడమే కాకుండా, ఆ దిశలో ముందడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి అని కొనియాడారు. స్థానిక సంస్థల్లో 34శాతం మేరకు బీసీలకు అవకాశం కల్పించారని, వైయస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా బిసి వర్గాల పిల్లలుపెద్ద చదువులు చదవగలిగారని వివరించారు. ఆరోగ్యశ్రీ పేదలకు వరంగా మారిందని, కార్పొరేట్ వైద్యం కూడా పేదలకు అందుబాటులోకి వచ్చిందని, ఈ విషయంలో తండ్రికన్నా ఎక్కువగా చెయ్యాలని జగనన్న తపిస్తున్నారని చెప్పారు.
కనిగిరి నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్రకు జనం పెద్దఎత్తున హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.