తమ ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు కావాలని ప్రజలు భావించి ఉండవచ్చని, అందుకే కూటమిని గెలిపించారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని… నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం పూర్తి చేయాలని సూచించారు. విజయనగరంలో పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. ప్రజలకు మేలు జరగాలన్నదే తమ అభిమతమని… వైసీపీ ఓటమికి కారణాలు, విశ్లేషణలు చేయడానికి ఇది సరైన సమయం కాదని… కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుందని అన్నారు.
ఓటమికి వైఎస్ జగన్ ఒక్కడిదే బాధ్యత అనడం సరికాదని.. ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటి వాదనలు వస్తుంటాయని…. గెలిచినా, ఓడినా ఆయా పార్టీల అధినేతలదే బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని.. కానీ ఒక పార్టీగా జగన్ నాయకత్వంలో మేమంతా కలిసి పలిచేశామని, ఓటమిలో తమ బాధ్యత కూడా తప్పకుండా ఉంటుందని… ఆయన ఓడిపోలేదని, పార్టీగా ఓటమి పాలయ్యామని విశ్లేషించారు.
తమ విధానం ప్రజలు అంగీకరించలేదని, కూటమి ఇంకా మెరుగ్గా చేస్తుందని ఆశించారని… ఆ రకంగా జరగాలని, ఆ బలం కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై అన్ని వివరాలూ గత ఆర్ధిక మంత్రి వివరించారని… దానిలో దాచిపెట్టడానికి ఏమీ లేదని బొత్స అన్నారు. ఎన్ని అప్పులు తీసుకు వచ్చామో అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పారని గుర్తు చేశారు.