Online movie ticketing :
సినిమాను ప్రేమించే సగటు ప్రేక్షకుడికి సౌకర్యవంతంగా ఉండేందుకు, సరసమైన ధరకే వినోదం అందించేందుకే ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకువస్తున్నామని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, రవాణాశాఖమంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) స్పష్టం చేశారు. నేడు అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు. కష్టజీవికి ప్రధాన వినోదంగా ఉన్న సినిమా మాద్యమంలో కొన్ని విపరీత పోకడలు వచ్చాయని వ్యాఖ్యానించారు. బెనిఫిట్ షోల పేరిట ఇష్టారాజ్యంగా, యధేచ్చగా ఎక్కువ రేట్లకు టిక్కెట్లు అమ్ముతున్నారని, రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాల్సి ఉండగా ఏడు, ఎనిమిది షోల వరకూ ప్రదర్శిస్తున్నారని చెప్పారు. సినీ పరిశ్రమ కాబట్టి తమకు ఎదురు ఉండకూడదు, మమ్మల్ని చట్టాలు ఆపజాలవనే భావనతో కొంతమంది ఉన్నారని ఎద్దేవా చేశారు.
కొన్ని సినిమాల విషయంలో వారు వెల్లడించిన కలెక్షన్లకు, ప్రభుత్వానికి వస్తున్నపన్నులకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటోందన్నారు. ప్రేక్షకుడి బలహీనతలను సొమ్ము చేసుకొనేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకునేందుకే ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను తీసుకు వస్తున్నామని, దీనికోసమే సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు తెచ్చామని తెలిపారు. రైల్వే, బస్సు, విమాన టిక్కెట్లు కొన్నట్లుగానే సినిమా టికెట్ ను కూడా ఇంటి దగ్గరినుంచే బుక్ చేసుకునే విధానంతో ప్రేక్షకుడికి మరింత వెసులుబాటు ఉంటుందన్నారు.
ప్రభుత్వ ఆలోచన వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, థియేటర్ యజమానులు ఎవరూ ఇబ్బంది పడడం లేదని, కానీ రాష్ట్రంలో విపక్షం, దానికి వంత పాడే పార్టీలు, విపక్షానికి బాకా ఊదే కొన్ని మీడియా సంస్థలు మాత్రమే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని నాని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ పోర్టల్ నిర్వహణ మాత్రమే ప్రభుత్వ అధీనంలో ఉంటుందని… అత్యంత పారదర్శకంగా, రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా గేట్ వే ద్వారా ఏరోజుకారోజు ఈ డబ్బులు నిర్మాతకు చేరతాయని మంత్రి వివరించారు.
Also Read : కల్నల్ సంతోష్‌బాబుకు మహావీర్ చక్ర