పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తానని చెప్పారని, కానీ దానికోసం ఆయన చెబుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు. రంగా పేరు చెబితే కాపులకు ఉత్తేజం కలుగుతుందని, అలాంటి రంగా భార్య గురించి, ఆమె కులం గురించి… వంగవీటి రాధాకు లేని కులం మనకెందుకు అంటూ పవన్ చెప్పడాన్ని నాని తప్పుబట్టారు. తొడలు కొట్టేవాళ్ళు, సవాళ్లు చేసేవాళ్ళు టిడిపిలో, జనసేనలోనే ఉన్నారని స్పందించారు. తనను విమర్శించే వారితో శిస్తు కట్టిస్తానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై నాని ఘాటుగా స్పందించారు. మరో జన్మ ఎత్తినా వైసీపీ నేతలతో శిస్తులు కట్టించడం పవన్ వల్ల, ఆయన బాస్ చంద్రబాబు వల్ల కూడా కాదంటూ హెచ్చరించారు. తన ఇంట్లో రాజకీయ నాయకులు ఎవరూ లేరంటూ తన సొంత అన్న చిరంజీవిని పవన్ అవమానించారని ఎద్దేవా చేశారు. రోజుకు రెండు కోట్లు తన సంపాదన అని పవన్ చెప్పారని, గత తన సంపాదన గురించి వారం ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
అన్ని పార్టీలూ కలిసి పోటీ చేయాలనే తాము కోరుకుంటున్నామని.. అసలు వారు విడిపోయారని తాము అనుకోవడం లేదని నాని అన్నారు. గత ఎన్నికల్లో బాబు కోసమే వారు విడివిడిగా పోటీ చేశారని, ఇప్పుడు మళ్ళీ బాబు కోసమే కలుస్తారని వ్యాఖ్యానించారు. అవసరాల కోసం కలిసి పోటీ చేస్తున్నామన్న విషయం తేటతెల్లం చేయాలని సూచించారు. బందరులో బిసి డిక్లరేషన్ ఇస్తానన్న పవన్ హామీ ఏమైందని నాని నిలదీశారు. చంద్రబాబును సిఎం చేయడానికి తనతో కలిసి రావాలని అభిమానులకు పవన్ నిన్న విజ్ఞప్తి చేశారని, ఇదే నిన్నటి సభ లక్ష్యమని… అసలు దీన్ని ఒక రాజకీయ పార్టీ అంటామా అని నాని ధ్వజమెత్తారు. తాను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి కాబట్టి దానికోసం అందరం కలిసి బాబు వెంట వెళ్దామని పవన్ అంటున్నారని పేర్ని అన్నారు.
Also Read : నాకు ‘కాపు’ కాయండి: పవన్ విజ్ఞప్తి