తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని సమావేశమయ్యారు. ఏపీ సచివాలయంలోని ఐదవ బ్లాక్ లోని సమావేశ మందిరంలో ఈ భేటీ మొదలైంది. ఈ సమావేశంలో సినిమా నిర్మాతలు, ప్రదర్శనకారులు, పంపిణీదారులు పాల్గొన్నారు. ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ, కోవిడ్ వల్ల సినిమా పరిశ్రమకు ఎదురైన ఇబ్బందులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో చర్చినిన విషయాలపై మంత్రి నాని సిఎం జగన్ కు ఓ నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటులు, దర్శక నిర్మాతలతో సిఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
నిన్న హైదరాబాద్ లో జరిగిన లవ్ స్టొరి ప్రీ రిలీజ్ వేడుకలో తెలుగు సినిమా పరిశ్రమను కాపాడాలని, ఇబ్బందులను పరిష్కరించేందుకు తెలుగు రాష్ట్రాల సిఎం లు నడుం బిగించాలని మెగా స్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నేటి సమావేశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలో మంత్రి తో పాటు ఎఫ్.డి.సి. ఛైర్మన్ విజయ చందర్, నిర్మాతలు దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు, ఆన్‌లైన్ టికెట్‌పై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. నేటి సమావేశంలో ఆన్‌లైన్ సినిమా టికెట్ అంశంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.