Saturday, November 23, 2024
HomeTrending NewsYSRCP: ఇదో దిక్కుమాలిన విజన్: పేర్ని

YSRCP: ఇదో దిక్కుమాలిన విజన్: పేర్ని

విజన్ 2047 పేరుతో చంద్రబాబు కాలజ్ఞానం చెబుతున్నారని,  గతంలో ఆయన ఇచ్చిన  విజన్-2020తో సాధించేదేమిటో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలను తగ్గించమని ఆందోళన చేస్తే వారిపై తూటాలు దించి, ప్రాణాలు బలిగొన్న చంద్రబాబు ఇప్పుడు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.  విజన్ పబ్లిసిటీ చంద్రబాబు పథకమని నాని అన్నారు.  వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఇతరత్రా రంగాలకు  మళ్ళించాలంటూ మెకన్సీ ద్వారా రాయించిన 2020  విజన్ లో చంద్రబాబు  పేర్కొన్నారని గుర్తు చేశారు. ఈ రకంగా వ్యవసాయం దండుగ అని చెప్పలేదా… ఇప్పటికీ రాష్ట్రంలో 63 శాతం మంది ఇంకా వ్యవసాయాన్నే కొనసాగిస్తున్నారని… అలాంటప్పుడు ఆ విజన్  పెట్టడంలో అర్ధం ఏమిటని నిలదీశారు.

ఈ రాష్ట్రంలో చంద్రబాబు మొదలు పెట్టి పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టు ఒక్కటీ లేదని,  చిత్తూరు జిల్లాకు, కనీసం కుప్పం కు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారని విమర్శించారు. సిఎంగా పనిచేసిన 14 ఏళ్ళలో సొంత జిల్లాకు, నియోజకవర్గానికీ కూడా నీళ్ళు ఇవ్వని ఈ దార్శనికుడు విజన్ ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఎవరిని మోసం చేయడానికి ప్రాజెక్టులు సందర్శిస్తున్నారో చెప్పాలన్నారు.  అధికారంలో ఉన్నప్పుడు  శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలు చూసి మురిసిపోయారు కానీ ఒక్క ప్రభుత్వ పాఠశాలనైనా బాగు  చేశారా?  అని అడిగారు. అసలు ఏ రంగంలోనూ సంస్కరణలు చేయకుండా ఇప్పుడు ఓ దిక్కుమాలిన విజన్ ఇచ్చారని దుయ్యబట్టారు.

2014-19 మధ్య  రైతులు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని వేలం వేయడంలో ఏపీ ముందు స్థానంలో ఉందని,  మహిళా స్వయం సహాయక బృందాల రుణాలు కూడా రద్దు చేయలేదని పేర్ని ఫైర్ అయ్యారు. వయసులో ఏముందని… పేదలకు మంచి చేయడమే అసలు విజన్ అని స్పష్టం చేశారు. అధికారం ఉంటే ఇక్కడ నివాసం, లేకపోతే ప్రవాసం అనేది బాబు విజన్ అని అభివర్ణించారు.  విజన్ 2047 డాక్యుమెంట్ అనేది 2024 ఎన్నికల కు ఓటర్లకు వేసిన ఓ ఎర అని అభిప్రాయపడ్డారు.

పవన్ సొల్లు కబుర్లు మాని, 2014 నుంచి 19 వరకూ రాష్ట్రానికి ఆయన వల్ల ఏమి మేలు జరిగిందే చెప్పాలన్నారు. పవన్ ఓ రాజకీయ మోసగాడని అభివర్ణించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్