Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Sirivennela – Literature in to movies:
తెలుగు పాట అంపశయ్య మీద ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంకోసం ఊపిరి బిగబట్టి ముందుగానే ఊర్ధ్వలోకం కలలు కంటోంది. మైఖేల్ జాక్సనే మూర్ఛపోయే మూర్చనలతో తెలుగు పాట ఇంగ్లీషు పక్షపాతం, పక్షవాతంతో పల్లవి చరణాల కాలుచేతులు నిలువెల్లా కొట్టుకుంటున్నాయి. చెవులు చిల్లులు పడే వాద్య హోరులో మాటలు తమకు తాముగా పాడె మీద పదాల పిడకలు పేర్చుకున్నాయి .

కే అంటే ఐ అంటే ఎస్ అంటే అంటూ అక్షరాలు విరిగి విరిగి ఒకటో ఎక్కం కూడా గుర్తులేకుండా చేశాయి. భావం పాతాళంలో సంతలో తప్పిపోయిన పసిపిల్లాడిలా గుక్కపట్టి ఏడుస్తోంది. తెలుగుపాటలో తెలుగుపదాలు, పలుకుబళ్లు, జాతీయాలు, వాడుకమాటలు, మాండలికాలు, తనదయిన వ్యక్తీకరణలు ఇంగువకట్టిన గుడ్డగా అయినా మిగల్లేదు. తెలుగు చదవలేన, రాయలేని, పొరపాటునకూడా మాట్లాడలేని, మాట్లాడకూడని హీరో హీరో ఇన్ ల ఇంగ్లీషు వాగ్ వైభవ వెస్ట్రన్ ప్రవాహంలో నిలువనీడలేక తెలుగు భాషా సరస్వతి ఆంధ్ర , తెలంగాణా పల్లెల్లో చదువురాని వారి గడపదాటి రావడంలేదు. షేక్స్ పియర్ ను చంపి పుట్టిన తెలుగు జాతి ఇప్పుడు పుట్టీ పుట్టగానే ఇంగ్లీషులోనే ట్విన్కిల్ ట్విన్కిల్ అని ఏడుస్తోంది. ఆపై ఉత్తమగతులకు, అమెరికా డాలర్ల సేద్యానికి కే జీ టు పీ జీ ఇంగ్లీషునే పీల్చి , తిని ,తాగి జీర్ణం చేసుకోవాలి కాబట్టి తెలుగు మన మెదళ్ల సాఫ్ట్ వేర్ లోనే ఎప్పుడో డిలిట్ అయిపొయింది. యథా ప్రేక్షక – తథా చిత్రం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ? సారాంశం – సినిమాలు అభిమానులు అందరం ఇంగ్లీషునే మేస్తూ, మోస్తూ దాని పేరు తెలుగు అనుకుంటూ మురిసిపోతున్నాం.

ఇలాంటి బాధలు, నిట్టూర్పులు, ఆవేదనలు, ఆక్రోషాలు అన్నిటికీ సమాధానం సిరివెన్నెల కలం. తొలితరం మల్లాది , సముద్రాల , పింగళి నుండి నిన్నటి వేటూరి వరకు ఆ తెలుగుపాటల తోటమాలుల వరుసలో చివర అంత భారాన్ని మోస్తున్నవాడు, మోయకతప్పనివాడు, మోయగలిగినవాడు సిరివెన్నెల.

సూర్యుడి కిరణాలను పగటి వీణకు తంత్రులుగా బిగిస్తాడు. జామురాతిరిని జాబిలమ్మ పాటతో జోకొడతాడు. తెలిమంచులో తేలిపోతాడు. ఇలగొంతులో పలుకు అవుతాడు . జాలిగా జాబిలమ్మను రేయి రేయి అంతా రెప్పవేయకుండా ఓదారుస్తాడు. ఎంతవరకు ఎందుకొరకు గమ్యం వైపు ఆగకుండా దూసుకుపోతాడు. పాటను పంచామృతం చేసి తీర్థంగా పంచుతాడు. పదాలను నిప్పులుగా చేసి సిగ్గులేనివారిని అగ్గితో కడుగుతాడు. మైనింగ్ మాఫియాల మధ్య కృష్ణం వందే జగద్గురుమ్ అంటూ దశావతారాల పాట పాడతాడు. అణిమ గరిమ మహిమ లాంటి పారిభాషిక ప్రత్యేక నిఘంటువుల్లో తప్ప బయట దొరకని మాటలను తెలుగుపాటలో బంధిస్తాడు . రాత్రి దిగిన సూర్యుడిని పట్టి తూర్పుకు లాక్కొస్తాడు. మత్తు వదిలిస్తాడు. బుద్ధి చెబుతాడు. హెచ్చరిస్తాడు. మనం అడగలేని , మనకు అడగడం చేతకాని ప్రశ్నలను అడుగుతాడు. మూగబోయిన మన గొంతు తానవుతాడు. తెలుగు పాట మూగబోకుండా తను పదమవుతాడు. పాటలో తెలుగు దీపం కొడిగట్టకుండా తన పద పాదాల చేతులు అడ్డుపెట్టి ఉన్నాడు.

(సిరివెన్నెలకు పద్మశ్రీ అవార్డు ప్రకటించినప్పుడు నా రాత ఇది. అప్పుడాయన దుబాయ్ లో ఉన్నారు. ఒక సినిమా మిత్రుడు ఆయనకు ఈ వ్యాసం పంపితే చదివి, అక్కడి నుండే ఫోన్ చేసి నన్ను అభినందించారు. ఆ క్షణాన నాకొక పద్మశ్రీ వచ్చినట్లు ఫీల్ అయ్యాను. దుబాయ్ నుండి రాగానే నన్ను సాదరంగా ఇంటికి పిలిచారు. అప్పటి నుండి తరచుగా ఆయనతో మాట్లాడుతున్నాను. నా పిచ్చి రాతలను గుర్తు పెట్టుకుని ఆయన పొగుడుతుంటే నేను సిగ్గుపడ్డ సందర్భాలెన్నో? ఆయనకు నివాళిగా వ్యాసం రాయడానికి ఇప్పటికిప్పుడు నా మనసు సిద్ధంగా లేదు. ఆయన లేరన్న వార్త విని ఏమి రాయాలో తెలియక ఈ జ్ఞాపకాల నెమరువేత)

-పమిడికాల్వ మధుసూదన్

Also watch :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com