ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండో రోజు పర్యటన తెలంగాణలో విజయవంతంగా సాగింది. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని సంగారెడ్డి జిల్లా పటేల్ గూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత పటాన్ చెరువు బిజెపి విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. రాష్ట్రాల్లో కుటుంబ పాలనపై మోడీ ఘాటుగా స్పందించారు.
కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు కుటుంబ పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో పాలకుల కుటుంబాలు ధనవంతులు అవుతుంటే రాష్ట్రాలు దివాళా తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయటం లేదని, వారసత్వ రాజకీయాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని, కుటుంబ పాలనతో ప్రతిభ ఉన్న యువతకు అన్యాయం జరుగుతోందన్నారు. అవినీతిని బయటపెడుతున్నా అనే అక్కసుతో కాంగ్రెస్ విమర్శలు చేస్తోందన్నారు.
కుటుంబ పార్టీల పాలనలో వారి కుటుంబాలే బాగుపడ్డాయని, దోచుకోవడానికి వారికి ఏమైనా లైసెన్స్ ఉందా అని ప్రధాని ప్రశ్నించారు. ఒక్కో కుటుంబంలో 50 మంది వరకు ప్రజల సొమ్ము దోచుకుతింటున్నారని మండిపడ్డారు. మోడీకి కుటుంబం లేకపోతే కుటుంబ పార్టీలన్నీ యుద్ధానికి దిగుతాయా అని ప్రశ్నించారు. కుటుంబ పార్టీలకు తమ కుటుంబమే ఫస్ట్ అని.. కానీ మోడీకి నేషన్ ఫస్ట్ అన్నారు. మేమంతా మోడీ కుటుంబమే అని దేశ ప్రజలు అంటున్నారని.. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పని పదేళ్లలో బీజేపీ చేసి చూపిందన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ కోట్లు దోచుకుతినగా.. కాంగ్రెస్కు కొత్త ఏటిఎంగా మారిందన్నారు.
మోడీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ అని ప్రధాని తెలుగులో చెప్పటంతో సభికుల నుంచి హర్షద్వానాలు వెల్లువెత్తాయి. కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేస్తామని చెప్పామని. చేశామా? లేదా? అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట చేస్తామని చెప్పాం.. చేశామా? లేదా?.. మోడీ ఇచ్చిన గ్యారెంటీ.. నెరవేరిందా? లేదా అని అన్నారు. ఇప్పుడు మీకు మరో గ్యారెంటీ ఇస్తున్నా అన్న ప్రధాని కొన్నేండ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దుతానని భరోసా ఇచ్చారు.
బిహార్లో ఇండియా కూటమి నేతలు ప్రధాని వ్యక్తిగత జీవితంపై చేసిన విమర్శలు బిజెపికి ఇప్పుడు అస్త్రంగా మారాయి. ఇన్నాళ్ళు వివిధ రాష్ట్రాల్లో విపక్ష నేతలపై ఈడి, ఆదాయపన్ను శాఖ దాడులపై రాజకీయ ప్రేరేపితమని విమర్శలు రాగా.. తాజాగా ప్రధాని ఎదురుదాడితో ఇండియా కూటమి ఆత్మరక్షణలో పడేలా చేసింది.
తెలంగాణ పర్యటనలో మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు ప్రధాని మోడీ ప్రసంగం రాటు దేలింది. శాసనసభ ఎన్నికల సమయంలో ప్రధాని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తే ప్రజలు సీరియస్ తీసుకున్నట్టు కనిపించలేదు. ఈ దఫా కుటుంబ పాలనపై ప్రధాని చేసిన విమర్శలు పరోక్షంగా కెసిఆర్ కుటుంబానికి పూర్తి స్థాయిలో వర్తిస్తాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ మారుతోంది. గతంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం చేసేవారు. ఆదిలాబాద్, సంగారెడ్డి సభల్లో ప్రధాని హిందీలోనే ప్రసంగించటం గమనార్హం.
-దేశవేని భాస్కర్