Tuesday, September 24, 2024
HomeTrending Newsఅన్ని రాష్ట్రాల అభివృద్దే మోదీ లక్ష్యం - బండి సంజయ్

అన్ని రాష్ట్రాల అభివృద్దే మోదీ లక్ష్యం – బండి సంజయ్

ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలు అభివృద్ది చేసి శక్తివంతమైన భారత్ ను రూపొందించాలన్నదే ప్రధానమంత్రి మోదీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టిన అభివ్రుద్ధి పనులకు హాజరయ్యేందుకు ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనను అడ్డుకోవడం ఏమాతర్రం సమంజసం కాదని అన్నారు. అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా తెలంగాణను అభివ్రుద్ధి చేసుకుందామని కోరారు. ఈరోజు రామగుండంలో జరిగిన మీడియా సమావేశంలో బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా మాట్లాడారు. ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, జి.వివేక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పాల్గొన్నారు. వారందరినీ ఎస్.కుమార్ శాలువా కప్పి సత్కరించారు.

• తొలుత భగవంత్ ఖుబా మాట్లాడుతూ…. ‘‘దేశంలో మూతపడ్డ 5 ఎరువుల కర్మాగారాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్దరిస్తూ ఎరువుల ఉత్పత్తిని ప్రారంభించారు. అందులో భాగంగా రామగుండం ఎరువుల కార్మాగారంలో ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో ఈనెల 12న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రామగుండం వచ్చి కర్మాగారాన్ని జాతికి అంకితం చేయబోతున్నారు‘‘ అని పేర్కొన్నారు. ‘‘ఆర్ఎఫ్ సీఎల్ ఏటా 12.75 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తోంది. 100 శాతం ఉత్పాదన జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడంతోపటు పాటు అదేరోజు జాతీయ రహదారుల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. పెద్దపల్లి జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు‘‘అని పేర్కొన్నారు.

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ ఏమన్నారంటే….

• ఈనెల 12న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక నేపథ్యంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేస్తాం. మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాలను చేపట్టడం గొప్ప విషయం. నరేంద్రమోదీ ప్రభుత్వం రాకముందు ఆర్ఎఫ్ సీఎల్, ఎన్టీపీసీ, సింగరేణి పరిస్థితి ఏమిటి? ఇప్పుడున్న పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవాలి.

• మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్దరిస్తున్నారు. రైతును రాజు చేయాలనే ధ్రుఢ సంకల్పంతో మోదీ ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టింది. ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టి రోజుల తరబడి ఎదురుచూసి చనిపోయిన సందర్భాలు అనేకం చూశాం. ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడే ఎరువుల కార్మాగారాన్ని పునరుద్దరించి యూరియా కొరత లేకుండా చేస్తున్నారు.

• అట్లాగే యూరియా ఉత్పత్తి వ్యయం భారమైనప్పటికీ రైతులపై పడకుండా ఉండాలనే ఉద్దేశంతో అతి తక్కువ ధరకు యూరియా సబ్సిడీ అందిస్తున్నారు. యూరియా బస్తా అసలు ధర రూ.3,500 లుంటే రైతులకు రూ.200 లకే అందిస్తున్నారు. టన్ను యూరియాకు రూ. 40 వేలు ఖర్చయితే రైతులకు రూ.5 వేలకు అందిస్తున్నాం. అట్లాగే కిసాన్ సమ్మాన్ నిధి, యూరియా, డీఏపీ ఇతర ఖర్చుల పేరుతో ఒక్కో ఎకరాకు రూ.35 వేల వరకు సబ్సిడీ అందిస్తున్న ఘనత మోదీదే.

• రాష్ట్ర విభజన సమయంలో కొత్త రాష్ట్రం వస్తే చీకటిమయమేనని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నరు. కానీ ఏమైంది? ఆ పరిస్థితి లేకుండా ఇక్కడే ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ పనులు కొనసాగుతున్నాయి. ఆనాడు సింగరేణి దివాళా తీస్తే నాటి ప్రధాని వాజ్ పేయి 700 కోట్ల మారిటోరియాన్ని ప్రకటించి ఆదుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

• ప్రధాని రాక నేపథ్యంలో తెలంగాణలో మూడు జాతీయ రహదారులతోపాటు కొత్తగూడెం-సత్తుపల్లి గూడ్స్ రైలును జాతికి అంకితం చేయబోతున్నారు. అదేరోజు ఎన్టీపీసీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రధాని హాజరై తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రైతాంగానికి వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా 75 అసెంబ్లీ కేంద్రాల్లో ప్రత్యేక స్క్రీన్స్ ఏర్పాటు చేసి ప్రధాని సభను వీక్షించేలా చేస్తున్నాం.

• ఇదొక అభివ్రుద్ధి కార్యక్రమం. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని రాష్ట్రాలు అభివ్రుద్ధి చెందితేనే శక్తివంతమైన భారత్ రూపొందుతుందనేది మోదీ ఆలోచన. అభివ్రుద్ధి పనులకు వస్తున్న నేపథ్యంలో అడ్డుకోవడం సమంజసం కాదు. అందరం కలిసి అభివ్రుద్ధి చేసుకుందామని అన్ని రాజకీయ పార్టీలను, సంఘాలను కోరుతున్నా.

RELATED ARTICLES

Most Popular

న్యూస్