ఎన్నికల ముందు ఎక్కడ జిల్లా ఎస్పీలను మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయని, ఇటీవల ఆ అధికారులనే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిందని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. జిల్లాలో పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న అధికారులను హఠాత్తుగా మార్చడం వల్ల కొత్త అధికారులకు స్థానిక స్థితిగతులపై అవహానన లేదని అందులే ఘర్షణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. టిడిపి చీఫ్ చంద్రబాబు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి లేఖల ఆధారంగానే ఎన్నికల సంఘం ఆ అధికారులను పక్కన పెట్టిందని… కొత్తగా వచ్చినవారు కూటమి నేతలతో కుమ్మక్కయ్యారని అంబటి ఆరోపించారు. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడమే దీనికి నిదర్శనమన్నారు. పోలింగ్, తదనంతరం జరిగిన ఘర్షణలపై ఎన్నికల సంఘం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ను వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం కలుసుకుంది. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు.
అధికారుల మార్పు వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిందని, పోలీసు యంత్రాంగం విపక్షంతో అంటకాగిందని, వారి నుంచి లంచాలు కూడా తీసుకున్నారని… తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఆ పార్టీ రచించిన పన్నాగంలో వీరు భాగాస్వాములయ్యారని తీవ్రంగా ఆక్షేపించారు. టిడిపి నేతలు పలు చోట్ల బూత్ లు ఆక్రమించారని, ఘర్షణల్లో చాలా మందికి తలకాయలు పగిలాయని… టిడిపి నేతల బెదిరింపులు, హింసాకాండతో చాలా గ్రామాల్లో ప్రజలు ఊళ్ళు విడిచి వెళ్లిపోయారని, ఇప్పటికీ వారు గ్రామాలకు రాలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు.
తాము కేసులు పెడితే వాటికి పోటీగా అటువైపు నుంచి కూడా కౌంటర్ కేసులు తీసుకొని, అక్రమంగా తమ పార్టీ నేతలపై కేసులు బనాయిస్తున్నారని, 324 సెక్షన్ పెట్టాల్సిన చోట 307 నమోదు చేస్తున్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అన్ని విషయాలనూ వినీత్ బ్రిజ్ లాల్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. పోలీసు అధికారుల కాల్ డేటా ను కూడా విశ్లేషించాలని డిమాండ్ చేశారు.