Friday, November 22, 2024
HomeTrending Newsపిన్నెల్లి కోసం గాలిస్తున్నాం: సిఈఓ మీనా

పిన్నెల్లి కోసం గాలిస్తున్నాం: సిఈఓ మీనా

మాచర్లలో పరిస్థితి ఇప్పుడే అదుపులోకి వచ్చిందని, ఈ సమయంలో టిడిపి నేతలు అక్కడకు వెళ్ళడం సరికాదని, మళ్ళీ అదుపుతప్పే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అభిప్రాయపడ్డారు. పాల్వాయ్ గేట్ లో ఈవిఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన వీడియోను తాము మీడియాకు విడుదల చేయలేదని స్పష్టం చేశారు. ఎలా వైరల్ అయిందో తెలుసుకుంటామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారి ఇద్దరినీ సస్పెండ్ చేశామని చెప్పారు. పిన్నెల్లి అరెస్టు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉందని, దీనికోసం హైదరాబాద్ లో పోలీసు అధికారుల బృందం పనిచేస్తోందని, ఓ అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, నలుగురు సిఐలు ఈ అక్కడే  ఉన్నారని చెప్పారు.

గురువారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మీనా  మీడియాతో కాసేపు చిట్ చాట్ చేశారు.

కాగా, జూన్ 4న  జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మీనా జిల్లాల అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికా బద్దంగా చేసుకోవాలని సూచించారు. చెదురు మొదురు సంఘటనలు మినహా అందరి సమిష్టికృషితో 13న జరిగిన ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, అదే స్పూర్తితో ఓట్ల లెక్కింపుకు కూడా ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేసుకుని విజయవంతంగా నిర్వహించాలని కోరారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలని, ఎలాంటి వివాదాలకు తావులేకుండా సంబందిత వివరాలను  ముందుగానే వ్రాతపూర్వకంగా సంబందిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజంట్లకు ముందుగానే తెలియజేయలన్నారు. పాత్రికేయులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.

ఈవీఎం లను భద్రపర్చిన స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడు అంచెల భద్రత కొనసాగుతున్నదని, అయితే స్ర్టాంగ్‌ రూమ్‌లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్‌ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తుండాలన్నారు. భద్రత పర్యవేక్షణపై పోలీసు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

అదనపు సీఈవో లు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ తో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఈ వీడియో కాన్పరెన్సు లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్