Wednesday, March 18, 2026
HomeTrending Newsమంత్రి హత్య కేసులో రాజకీయ కుట్ర - బిజెపి

మంత్రి హత్య కేసులో రాజకీయ కుట్ర – బిజెపి

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర పన్నారంటూ సైబరాబాద్ పోలీసులు మహబూబ్ నగర్ యువకులపై తప్పుడు కేసు పెట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఈ కేసు వెనుక రాజకీయ, ప్రభుత్వ కుట్ర దాగి ఉందని, కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు ఆఫిడవిట్ సమర్పించాడని కొందరు వ్యక్తులు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారని, మహబూబ్ నగర్ లో మంత్రి అవినీతి, కబ్జాలపై వీళ్ళు సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తున్నారని ఆమె హైదరాబాద్ లో తెలిపారు. ఇది తట్టుకోలేని మంత్రి వీళ్లపై కక్షగట్టి వారం కిందట కిడ్నాప్ చేయించాడని, బాధితుల భార్యా, పిల్లలు నా దగ్గరకు వస్తే నేను ఈ కిడ్నాప్ వ్యవహారం పై మాట్లాడానని డీకే అరుణ చెప్పారు.

ఇది పూర్తిగా రాజకీయ కుట్రతో పెట్టిన కేసని, మహబూబ్ నగర్ లో అరాచకం చేస్తున్న మంత్రి తనపై సానుభూతి తెచ్చుకునేందుకు హత్యకు కుట్ర అని కేసు పెట్టించుకున్నాడని డీకే అరుణ విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు తెలుసునని, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ మీట్ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ కేసులో అవకాశం ఉన్న అన్ని విచారణ సంస్థలు, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని డీకే అరుణ వెల్లడించారు.

సామాజిక బాధ్యతగా ఆర్టీఐ ద్వారా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుల్ని బయట పెట్టిన యువకులపైనే మంత్రి హత్యకు కుట్ర అంటూ కేసులు పెట్టారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి విమర్శించారు. ఇది రాజకీయ కుట్ర తో పెట్టిన కేసని హైదరాబాద్లో ఆరోపించారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, పోలీసులు చట్టాన్ని కాపాడుతారా? లేక టిఆర్ఎస్ పార్టీ చేసే అరాచకాలకు వంత పాడుతారా? అని వ్యంగ్యంగా విమర్శించారు. మంత్రి శ్రీనివాస్ రాజకీయంగా ఇంత దిగజారుతారని ఊహించలేదని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని జితేందర్ రెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular