Friday, September 20, 2024
HomeTrending Newsరాజంపేటలో రాజుకున్న వేడి

రాజంపేటలో రాజుకున్న వేడి

వారిద్దరిదీ దశాబ్దాల వైరం….. ఒకే పార్టీలో ఉన్నా ఉప్పూ నిప్పూగానే మెలిగేవారు. 2014 నుంచి వారు వేర్వేరు దారుల్లోకి  వెళ్ళారు. ఇప్పుడు ఆ ఇద్దరూ మరోసారి రాజకీయ ప్రత్యర్థులుగా మారి సవాళ్లు ప్రతి సవాళ్ళతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ఒకరు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాగా, మరొకరు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

ఎస్వీ యూనివర్సిటీ నుంచే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- చంద్రబాబు నాయుడు ముఖాముఖి తలపడ్డారు. అదే పోరు రాజకీయాల్లో ఇప్పటికీ సాగుతూనే ఉంది. చంద్రబాబు 1978లోనే తొలిసారి ఎమ్మెల్యే కాగా పెదిరెడ్డి 1989లో అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1994, 2004 మినహా మిలిగిన అన్ని సార్లూ పెద్దిరెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. చంద్రబాబు 1983లో ఓటమి పాలుకాగా, 85లో పోటీ చేయలేదు. ఆ తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం అసెంబ్లీకి మారి అప్రతిహతంగా గెలుస్తున్నారు.

పెద్దిరెడ్డి- కిరణ్ కుమార్ రెడ్డిల విషయానికి వస్తే… నల్లారి అమర్ నాథ్ రెడ్డి వాయల్పాడు నుంచి 1972, 78, 85 ఎన్నికల్లో విజయం సాధించారు. అయన రాజకీయ వారసుడిగా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి 1989, 99, 2004ల్లో అదే అసెంబ్లీ నుంచి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత పీలేరుకు మారి 2009 విజయం సాధించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో పెద్దిరెడ్డి- అమర్ నాథ్ వర్గాల మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. అదే పెద్దిరెడ్డి- కిరణ్ ల మధ్య కూడా కొనసాగింది. పెద్దిరెడ్డి వైఎస్ వ్యతిరేకవర్గంలో ఉండేవారు. కిరణ్ వైఎస్ అనుచరుడిగా ఉంటూ వచ్చారు.

2009లో ఇద్దరూ గెలిచిన సందర్భంలో… వైఎస్ జగన్ ఒత్తిడితో పెద్దిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్న వైఎస్సార్… కిరణ్ కు స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. వైఎస్ మరణం తర్వాత రోశయ్య మంత్రివర్గంలో కొనసాగిన పెద్దిరెడ్డి కిరణ్ సిఎం అయిన తరువాత మాజీగా మారారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా విజయం సాధించి ప్రస్తుతం మంత్రిగా క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జగన్ కోటరీలో కీలకంగా ఉంటూ 2014, 2019 ఎన్నికల్లో రాజంపేట ఎంపిగా విజయం సాధించారు.

రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించి 2014లో  జై సమైఖ్యాంధ్ర పార్టీ నెలకొల్పిన కిరణ్ అసలు ఆ ఎన్నికల్లో పోటీకే దిగలేదు. ఆ పార్టీ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కొన్నాళ్ళ విరామం తరువాత కాంగ్రెస్ లో రీఎంట్రీ ఇచ్చి అక్కడా ఇమడలేక ఏడాది క్రితం బిజెపిలో చేరారు. తాజా ఎనికల్లో రాజంపేట నుంచి బిజెపి అభ్యర్ధిగా  బరిలోకి దిగి మిథున్ రెడ్డితో తలపడుతున్నారు.

జనసేనాని పవన్ పోటీ చేస్తోన్న పిఠాపురంకు మిథున్ రెడ్డిని ఇన్ ఛార్జ్ గా జగన్ నియమించారు. అందువల్ల రాజంపేట ఎన్నికల బాధ్యతను తండ్రి  రామచంద్రారెడ్డి భుజానికెత్తుకున్నారు.  కిరణ్ వల్లే కాంగ్రెస్ ఏపీలో కనుమరుగైపోయిందని…  అప్పట్లో కిరణ్ కంటే తనకే సిఎంగా అన్ని అర్హతలూ ఉన్నా…. చిదంబరంకు ముడుపులు చెల్లించి, సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని ఆయన సిఎం అయ్యారని పెద్దిరెడ్డి ఘాటుగా విమర్శలు చేస్తే…. జిల్లా అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి తన కాళ్ళు పట్టుకున్నారని కిరణ్ కూడా అదే స్థాయిలో బదులిచ్చారు.  మంత్రిగా ఉండి ఇన్ని అక్రమాలు చేశారని, ఇక ఇలాంటి వ్యక్తికి సిఎం అయ్యే అర్హత ఉంటుందా అని ప్రశ్నించారు.

బాబు – కిరణ్ ల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విభేదాలు ఉండేవి. కానీ ఇప్పుడు కూటమిలో ఇద్దరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి.

గత ఎన్నికల్లో రాజంపేట పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతం చేసి లోక్ సభకు గతంలో కంటే భారీ మెజార్టీ సాధించేలా వ్యూహాలు పన్నుతున్నారు పెద్దిరెడ్డి.

ప్రభుత్వ వ్యతిరేకత, మోడీపై ప్రజల్లో ఉన్న అనుకూలత, గతంలో ముఖ్యమంత్రిగా  తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలుగుదేశం పార్టీకి క్షేత్ర స్థాయిలో ఉన్న బలంతో ఎలాగోలా రాజంపేట స్థానాన్ని చేజిక్కించుకోవాలని నల్లారి ప్రయత్నిస్తున్నారు. ఒకరకంగా దాయాదుల పోరును రాజంపేట తలపిస్తుంది. ఇద్దరిలో ఎవరి చాణక్యం ఫలిస్తుందో వేచి చూడాలి.

కొసమెరుపు:
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి తరపున పోటీ చేస్తుండగా అదే లోక్ సభ పరిధిలోని పీలేరు అసెంబ్లీ నుంచి ఆయన సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. ఒకే కూటమిలో వేర్వేరు పార్టీల తరఫున సొంత అన్నదమ్ములు పోటీ చేస్తుండడం కూడా ఓ విశేషమే!

RELATED ARTICLES

Most Popular

న్యూస్